కళ్లెదుటే మోసం.. కాదనలేని దైనం
వడ్లు, నూకలు వస్తున్నాయని..
రెండు కిలోల తరుగు తీశారు
రెంజల్: అకాల వర్షాలు, మొంధా తుఫాను రైతులపై అదనపు భారాన్ని మోపాయి. కళ్లెదుటే మోసం జరుగుతున్నా కాదనలేని దీన పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రైతుల అవసరాలను బలహీనతలుగా మార్చుకుంటున్న మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. నూక పేరుతో క్వింటాకు రెండు నుంచి ఐదు కిలోల తరుగు తీస్తున్నారు. చేసేది లేక రైతులు మిల్లర్లు చెప్పిన కాడికి అందించి చేష్టలుడిగి చూస్తున్నారు. ఆరుగాలం కష్టపడి వానాకాలం సీజన్‌లో పంటలను సాగు చేసిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైంది. రైతుల ఆర్థిక అవసరాలను మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు కనీసం పెట్టుబడులు మిగిలితే చాలనే ఆలోచనతో మిల్లర్లు చెప్పినకాడికి తరుగు అందిస్తున్నారు. ప్రకృతి వైపరిత్యంతో సగానికి సగం దిగుబడులు తగ్గి తీవ్ర నష్టం వాటిల్లినా కనికరించని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.
వర్షాలతో తడిసిన ధాన్యం
ప్రారంభంలో పంటలను నూర్పిడి చేసిన రైతులు సకాలంలో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అకాల వర్షాలు, మొంధా తుఫానుతో వాతావరణం అనుకూలించకపోవడంతో వారం రోజుల పాటు రైతులు వరి కోతలకు దూరమయ్యారు. వానలు తగ్గి పోవడంతో కోత పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఒకే సారి పొలాలు కోతకు వచ్చాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడ్డారు. ధాన్యం మొలకలు రావడంతో కూలీలతో వడ్లను ఆరబోసి కల్లాల వద్దే కాపు కాశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చిన వెంటనే కేంద్రాల్లో విక్రయించారు. రైతులు విక్రయించడం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. వాటిని కేటాయించిన మిల్లర్లకు తరలించడం నిర్వాహకుల పని. కానీ నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లు రైతులను పిలిపించుకుని మీ ధాన్యం నూక శాతాన్ని బూచిగా చూపుతూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. తూకం చేసిన ధాన్యం లారీలను వాపస్ చేస్తామని బెదిరించడంతో లారీ కిరాయి, హమాలీ చార్జీలు రైతులే భరించాల్సి వస్తోంది. విపత్కర పరిస్థితులకు తల వంచి మిల్లర్లు చెప్పిన విధంగా తరుగు అందిస్తూ నష్టపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే మళ్లీ ఎక్కడ కొర్రీలు పెడతారోనని రైతులు నోరు విప్పట్లేదు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
వడ్లు, నూకలు వస్తున్నాయని ఐదు కిలోల తరుగు తీశారు. ముందు పది కిలోల తరుగు తీస్తామన్నారు. కాల్లా వెళ్లా బ్రతిమిలాడితే ఐదు కిలోలకు అంగీకరించారు. వానాకాలం సీజన్‌లో పెట్టుబడులు కూడా రాలేదు. తెగుళ్లు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది.
– నారాయణరెడ్డి, రైతు, రెంజల్
స్థానికంగా రైస్‌మిల్లుకు ధాన్యం ఎలాట్ చేశారు. వారు చెప్పినట్లు ముందుగా కిలోన్నర తరుగు ఇవ్వాలన్నారు. దానికి అంగీకరించాను. తీరా రైస్‌మిల్లుకు ధాన్యం లారీ తీసుకెళ్లిన తర్వాత నాలుగు కిలోల తరుగు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రెండు కిలోలకు అంగీకరించాను.
– తూర్పు కిషన్, రైతు, రెంజల్
తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడీ
క్వింటాలుకు 2 నుంచి 5 కిలోల
తరుగు తీస్తున్న మిల్లర్లు
నూక పేరుతో రైతులకు బ్లాక్‌మెయిల్
కేంద్రాల నిర్వాహకులు,
మిల్లర్ల మిలాకత్..?


