దుబాయిలో తప్పిపోయిన ఘన్‌పూర్ వాసి
మాచారెడ్డి: మండలంలోని ఘన్‌పూర్(ఎం) గ్రామాని కి చెందిన బోయిని శ్యామ్ శివ దుబాయి ఎయిర్ పోర్టులో తప్పిపోయినట్లు ఆయన తండ్రి దేవయ్య తెలిపారు. ఈమేరకు సోమవారం కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని కరీంనగర్‌లో గ్రామస్తులతో పాటు కలిసి తమ కుమారుడిని వెతికి స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా దుబాయిలో ఉంటున్న శ్యామ్‌శివ ఇటీవల గ్రామానికి వచ్చి ఈనెల 9న దుబాయి వెళ్లాడు. అక్కడికెళ్లిన రెండు రోజుల తర్వాత దుబాయిలో ఉండడం ఇష్టం లేదని తండ్రి దేవయ్యతో ఫోన్‌లో చెప్పాడు. వెంటనే కంపెనీ వారితో మాట్లాడగా ఈనెల 12న కంపెనీ వారు కారులో దుబాయి ఎయిర్ పోర్టులో దింపేసి వెళ్లారని, లగేజీ బోర్డింగ్ అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్‌కు వెళ్లకుండా బయటకు పోయినట్లు ఎయిర్ పోర్టు అధికారులు వివరించారన్నారు. దీంతో ఆందోళనకు గురైన తండ్రి దేవయ్య కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి అదృశ్యమైన శివను వెతికి గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు దేవయ్య తెలిపారు.


