సాగుకు వర్షం ఆటంకం
దిగుబడి తగ్గుతుంది
● నిత్యం కురుస్తున్న వాన
● యాసంగి సాగుకు తిప్పలు
బాల్కొండ: నిత్యం కురుస్తున్న వర్షాలతో యాసంగి సాగుకు తిప్పలు తప్పడం లేదు. పంటల సాగుకు నేల సిద్ధం చేసుకోలేపోతున్నామంటు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి నిత్యం వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పంట భూ ముల్లోకి వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం యాసంగిలో మక్క,సోయా పంటలను సాగు చేసిన నేలల్లో ఎర్రజొన్న, మక్క పంటలను సాగు చేస్తారు. మక్క పంటలకు కోతలు కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నేలను సిద్ధం చేసుకోలేదు. ప్రస్తుతం వరి పంటలు కోతకు రాగా నిత్యం కురుస్తున్న ముసురు వర్షంతో కోత కోసేందుకు జంకుతున్నారు. వరి పంటను కోసి ఆరబెట్టిన వారు వాటిని ఎండ బెట్టలేక తిప్పలు పడుతున్నారు. రైతులకు ప్రస్తుత వర్షం అన్ని రకాల ఆటంకాలను కలిగిస్తోంది. యాసంగిలో ప్రధానంగా ఎర్రజొన్న, మక్క పంటను సాగు చేస్తారు. కానీ నేలలను దుక్కి దున్నాలంటే తేమ శాతం ఎక్కువగా ఉండొద్దు. వర్షం కురుస్తుండడంతో పంట భూమిలో అధికంగా నీరే ఉంటోంది. దీంతో ట్రాక్టర్‌తో దుక్కి దున్నే పరిస్థితి ఉండటం లేదు. దుక్కి దున్ని రైతులు పంటలను సాగు చేస్తారు. ఇలా మరో వారం రోజుల పాటు వర్షం కురిస్తే నేలలను సిద్ధం చేసుకునే అవకాశం లేదంటున్నారు. నవంబర్ మొదటి వారం వరకు అయినా విత్తనాలను విత్తుకోవాలి. కానీ తుపాన్ మరో నాలుగు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో పంటల సాగు ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రకృతి వైపరిత్యం వల్ల రైతులు ఆనేక అవస్థలు పడుతున్నారు. వరుణుడు కరుణించి వర్షం నిలిస్తే పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
బాల్కొండలో వర్షం కురవడంతో సాగు చేయని పంట భూమి
నిత్యం కురుస్తున్న వర్షాలతో భూములను దుక్కి దున్ని సిద్ధం చేయలేక పోతున్నాం. యాసంగి పంటలను కనీసం వచ్చే నెల మొదటి వారం వరకు అయినా విత్తుకోవాలి. ఇలా నిత్యం వర్షం పడితే పంటలను విత్తడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. సాగు ఆలస్యంగా చేపడితే దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
– బుల్లెట్ రాంరెడ్డి, రైతు, రెంజర్ల


