వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలి
బోధన్: వాతావరణ ఆధారిత సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ కె. పవన్ చంద్రారెడ్డి రైతులకు సూచించారు. బుధవారం ఈ పరిశోధన కేంద్రం దత్తత గ్రామమైన సాలూర మండలంలోని హున్సా గ్రామ రైతు వేదిక భవనంలో యాసంగి సీజన్ పంటల సాగు పై రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిశోధన కేంద్రం అధిపతితో పాటు దత్తత గ్రామ ఇన్‌చార్జి, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగు, సంబంధిత అంశాలపై మాట్లాడారు. యాసంగి సీజన్‌లో సాగుకు అనువైన వరి విత్తనం రుద్రూర్ 1162 రకం లక్షణాలు, సాగువిధానం అంశాలను శాస్త్రవేత్త రమ్యరాథోడ్ వివరించారు. కీటక శాస్త్రవేత్త ఎం. సాయి చరణ్ వివిధ పంటల్లో ఆశించే చీడ పీడల నివారణ, విత్తన శుద్ధి చేసే విధానం, వరి, శనగ పంటల సాగుకు రసాయన ఎరువుల వినియోగం, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అవగాహన కల్పించారు. నాణ్యమైన విత్తనంసాగుతో లాభదాయకమైన పంట దిగుబడి సాధ్యమవుతుందని సూచించారు. శాస్త్రవేత్త రాకేశ్ పరిశోధన కేంద్రం నుంచి విడుదలైన చెరకు–81 రకం గుణగణాలు, మరో శాస్త్రవేత్త కృష్ణ చైతన్య పంటల సాగులో వినియోగించాల్సిన ఎరువుల మోతాదు, చౌడు భూయుల్లో పంటల సాగు జాగ్రత్తలను తెలిపారు. శాస్త్రవేత్త వైఎస్ పరమేశ్వరీ వరి, శనగ పంటల్లో కలుపు నివారణ అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం రుద్రూర్1162 రకం వరి విత్తనం, ఎన్‌బీఈజీ 452 రకం శనగ విత్తనాలను పది మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఏఈవో సంధ్య, రైతులు పాల్గొన్నారు.


