సబ్సిడీ చెల్లింపులను సులభతరం చేయాలి
సుభాష్‌నగర్/ జక్రాన్‌పల్లి: క్యూజీ బీజీ(క్వాలిటీ గ్యాప్ బ్రిడ్జింగ్ గ్రూప్) పథకం కింద స్పైసెస్ బోర్డు ఇస్తున్న 90శాతం సబ్సిడీ చెల్లింపులను సులభతరం చేయాలని జేఎం కేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాటుకూరి తిరుపతిరెడ్డి కోరారు. ఈమేరకు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని కలవడానికి రాగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ రాణి, ఆఫీస్ అసిస్టెంట్ జవహార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. స్పైసెస్ బోర్డు కింద అమలవుతున్న ఈజీబీజీ పథకంలో 90శాతం సబ్సిడీపై ఎఫ్‌పీవోలకు పసుపు పంట కోసిన తర్వాత అవసరమయ్యే టార్పాలిన్ షీట్స్, ఇతర సదుపాయాలు అందజేస్తుందని తెలిపారు. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ముందుగా పూర్తి మొత్తాన్ని చెల్లించి, ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని తిరిగి పొందడం కష్టతరంగా మారుతోందన్నారు. వీరికి ఆర్థికభారం తగ్గించడానికి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి స్పైసెస్‌బోర్డు నేరుగా 90శాతం సబ్సిడీ మొత్తాన్ని వెండర్‌కు చెల్లించి, మిగతా 10శాతాన్ని ఎఫ్‌పీవోలు బోర్డు ఖాతాలో జమ చేసేందుకు అనుమతించాలని కోరారు. తద్వారా రైతు ఉత్పత్తి సంస్థలకు తక్షణ ఆర్థికభారాన్ని తగ్గించవచ్చని, పరికరాల సరఫరా వేగవంతంగా జరుగుతుందన్నారు. స్పైసెస్ బోర్డు సబ్సిడీ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కొరటికల్, ఆదిలాబాద్ రైతుల ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు సామల భీమారెడ్డి, ధనూరి రాజారెడ్డి, పి.సంతోష్‌రెడ్డి, సీఈవో సుమన్ తదితరులు పాల్గొన్నారు.


