నా ఓటమి ఓ కుట్ర..
నిజామాబాద్‌అర్బన్: ‘ఇరవై ఏళ్లుగా కేసీఆర్ కోసం.. టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ కోసం పనిచేశా.. కుట్ర చేసి నన్ను బయటికి పంపారు. ఎంపీ ఎన్నికల్లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా? నిజామాబాద్ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆలోచించాలె. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా.. ఇది నా గడ్డ. ఎప్పటికై నా ఈ గడ్డలోనే కలిసిపోతా..’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆమెకు జాగృతి నాయకులు ఇందల్వాయి వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని కవిత ఇంటి వరకు తెలంగాణ విద్యార్థఇ సంఘం నాయకుడు శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇంటి వద్ద అభిమానులు, మహిళలనుద్దేశించి కవిత ప్రసంగించారు. అన్ని భావజాలాలకు మద్దతునిస్తూ ముందున్న జిల్లా మనదని, బీఆర్‌ఎస్ నుంచిమొదటిసారి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్‌ను గెలిపించారని గుర్తుచేశారు. మీ బిడ్డనైన తనను పార్లమెంట్‌కు పంపించారని, గతంలో బీఆర్‌ఎస్ పార్టీని దీవించి అన్ని సీట్లు గెలిపించారన్నారు. తాను బీ ఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయలేదని, కానీ కుట్ర చేసి బయటికి పంపించారని ఆవేదన వ్యక్తంచేశారు.
రూ. 50 వేల పరిహారం ఇచ్చే వరకు
ఉద్యమిస్తాం..
నవీపేట: గోదావరి తీర ప్రాంత ముంపు బాధిత రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా నవీపేట మండలం యంచ గ్రామంలో శనివారం సాయంత్రం ముంపు రైతులతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ చేతికొచ్చిన పంట మునిగి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు ఎలాంటి పరిహార చెల్లింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రైతులతోపాటు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఇక్కడి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 9 గ్రామాలలో 5 వేల ఎకరాలు నష్టపోతే అధికారులు తప్పుడు లెక్కలు చూపారని, కలెక్టర్ చొరవ తీసుకుని మరో సారి సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు రూ. 50 వేల పరిహారం చెల్లించేవరకు ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. అనంతరం రూ. 50 లక్షల ఎమ్మెల్సీ నిధులతో చేపట్టిన విఠలేశ్వరాలయం సీసీ రోడ్డును పరిశీలించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, బీఆర్‌ఎస్ నాయకులు నర్సింగ్‌రావ్, న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్, లాలూయాదవ్, సంజీవ్, కృష్ణమోహన్‌రావ్, నాగారావ్, శ్యామ్, నరహరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో మాట్లాడుతున్న
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
యంచలో మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత
ప్రభుత్వం సిగ్గుపడాలె..
రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, హాస్టళ్లలోని విద్యార్థులను ఎలుకలు కొరకడం, విద్యార్థినులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. విద్యార్థులకు కనీస భద్రత, ఆహారం పెట్టలేని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. సరైన విద్యా, వైద్యం, ఉద్యోగాలు అందించలేకపోతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారిందని, దీనిపై జిల్లాకు చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 పెన్షన్ కోసం పిడికిలి బిగించి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో కొంత సాధించుకున్నాం.. కానీ అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి అమరవీరుడి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. జనంబాటలో భాగంగా మేధావులు, విద్యార్థులతో సహా అన్నివర్గాలతో మాట్లాడతానని తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు.
ఎప్పటికై నా ఈ గడ్డలోనే కలిసిపోతా..
కుట్ర చేసి బయటికి పంపారు..
మీ ఆశీర్వాదం కోసం వచ్చా..
తెలంగాణ జాగృతి
అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
‘జాగృతి జనంబాట’ ప్రారంభం
నా ఓటమి ఓ కుట్ర..


