75 వేలకుపైగా పశువులకు టీకాలు
● జిల్లా పశుసంవర్ధకశాఖ
అధికారి రోహిత్‌రెడ్డి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): జిల్లాలోని 1.80 లక్షల గేదెలు, ఆవులు, దూడలు, లేగలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 75 వేలకుపైగా పశువులకు టీకాలు వేసినట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. మోపాల్ మండలం ముదక్‌పల్లిలో నిర్వహిస్తున్న గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్‌ను గాలికుంటువ్యాధి రహిత జిల్లాగా మార్చాలన్నారు. టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి, మాంసం దిగుబడి పెరుగుతుందన్నారు. టీ కాల పంపిణీ పూర్తిగా ఉచితమని, ఎవరైనా సిబ్బంది క్షేత్రస్థాయిలో డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నవంబర్ 14 వరకూ టీకాల పంపిణీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శిరీష, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ సురేశ్, గోపాలమిత్రలు రాజశేఖర్, రజనీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
మక్క కొనుగోలు పరిమితి పెంచండి
● ఎకరానికి 28 క్వింటాళ్ల
కొనుగోలుకు అనుమతివ్వండి
● ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ
డొంకేశ్వర్(ఆర్మూర్): ఖరీఫ్‌లో పండించిన మొక్కజొన్న పంట కొనుగోలుపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎకరానికి 28 క్వింటాళ్లు కొనేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలు త్వరగా వస్తే మక్క రైతులకు ఊరట కలుగనుంది. ఖరీఫ్ సీజన్‌లో రైతులు 52,093 ఎకరాల్లో మక్కను సాగు చేయగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో మక్కలు కొనుగోలు చేసే బాధ్యత మార్క్‌ఫెడ్‌కు అప్పగించగా ప్రభుత్వం ఇటీవల కొనుగోళ్లను ప్రారంభించింది. 32 సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2,500 మెట్రిక్ టన్నుల వరకు మక్కలను కొనుగోలు చేశారు. అయితే ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో రైతులు పండించిన పూర్తి పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎకరానికి 38–40 క్వింటాళ్ల మక్కలు ది గుబడి రాగా ప్రభుత్వం ఎకరానికి 18.5 క్వింటాళ్లే తీసుకోవడంతో మిగిలిన పంటను వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. ఈ సమస్యను రైతులు కలెక్టర్‌తోపాటు వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తె చ్చారు. సీలింగ్ లేకుండా పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతుల మేలుకోరి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వర గా అనుమతివ్వాలని కోరుతున్నారు.


