జూబ్లీహిల్స్ ప్రచారంలో జిల్లా నేతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నవంబర్‌లో జరుగనున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు తరలివెళ్లారు. జిల్లాలో పార్టీపరమైన, ఇతర ప్రైవేటు కార్యక్రమాలు ఉంటే హడావుడిగా వచ్చి వెళుతున్నారు. ప్రతిరోజూ అత్యధిక సమయం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే గడుపుతున్నారు. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పలువురు నాయకులకు ఆయా పార్టీల నాయకత్వాలు కీలకమైన బాధ్యతలు అప్పగించాయి. దీంతో సదరు జిల్లాకు చెందిన నాయకులంతా తీరిక లేకుండా జూబ్లీహిల్స్ ప్రచారపర్వంలో నిమగ్నమై ఉంటున్నారు. తమకు అప్పగించిన డివిజన్లలో, క్లస్టర్లలో కీలక నాయకులు తమ తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటాపోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులైన జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలకు సైతం కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్‌రెడ్డి, సుంకేట అన్వేష్‌రెడ్డి, తాహెర్‌బిన్ హాందాన్, నుడా చైర్మన్ కేశ వేణు సమన్వయకర్తలుగా పనిచేస్తున్నారు.
అధిష్టానం అప్పగించిన
ప్రాంతాల్లో బిజీబిజీగా..
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి పలువురు కీలక నాయకులు
బీఆర్‌ఎస్ తరుఫున ప్రచారంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో షేక్‌పేట డివిజన్ ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు పనిచేస్తున్నారు. ఈ క్లస్టర్ ఇన్‌చార్జుల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. అదేవిధంగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు షకీల్, గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి, సురేందర్ ఉన్నారు. షకీల్ భార్య ఆయేషా ఫాతిమా సైతం ప్రచారంలో ఉన్నారు.
బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ షేక్‌పేట డివిజన్‌లోని శక్తికేంద్రం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. జిల్లా నుంచి మరికొందరు బీజేపీ నాయకులు సైతం జూబ్లీహిల్స్ ప్రచార పర్వంలోకి దిగనున్నారు. జిల్లాలోనూ జూబ్లీహిల్స్ ఎన్నికల విషయమై వివిధ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.


