తరుగు పేరిట దోచుకుంటుండ్రు
● కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,
రైస్ మిల్లర్లపై రైతన్నల ఆగ్రహం
● కోటగిరిలో ప్రధాన రహదారిపై
రాస్తారోకో
రుద్రూర్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటను తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటగిరిలోని ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. తరుగు పేరుతో రైతులను దోచుకోవడం సిగ్గు.. సిగ్గు... తరుగు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఓ రైతు పురుగుల మందును తాగే యత్నం చేశారు. పోలీసులు వెంటనే మందు డబ్బా లాక్కున్నారు. ఎస్సై సునీల్ సమస్యను తహసీల్దార్ గంగాధర్‌కు వివరించగా, ఆయన వచ్చి రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో బస్తాకు 41 కిలోల ధాన్యం తూకం చేయాల్సి ఉండగా, ఆర కిలో తరుగు తీస్తున్నారని తెలిపారు. ధాన్యం లారీ రైస్‌మిల్‌కు పంపిన తరువాత ఉతార్ రావడం లేదని మళ్లీ అదనంగా తరుగు తీస్తామని ఇబ్బంది పెడుతున్నారన్నారు. త్వరలోనే రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతు నాయకులు తెళ్ల రవికుమార్, ఎముల నవీన్, అరవింద్, లక్ష్మణ్, శంకర్, సాయిలు, గంగాధర్, గంగాప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.
తరుగు పేరిట దోచుకుంటుండ్రు


