అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో భార్య మృతి,
భర్తకు తీవ్ర గాయాలు
బాన్సువాడ: బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న దంపతులను వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్త తీవ్రగాయాలపాలైన ఘటన బీర్కూర్ మండలం రైతునగర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన మోత్కూర్ సాయాగౌడ్, శకుంతల(50) భార్యభర్తలు. బీర్కూర్ మండలం కిష్టాపూర్‌లో వారి బంధువు చనిపోతే అంత్యక్రియలకు ఎక్స్‌ఎల్ వాహనంపై బయలుదేరారు. మిర్జాపూర్ మీదుగా రైతునగర్ నుంచి కిష్టాపూర్‌కు వెళ్లే దారిలో రైతునగర్ వద్ద మలుపు దాటుతుండగా ఎదురుగా పొతంగల్ నుంచి బాన్సువాడ మార్కెట్‌కు వస్తున్న బొలెరో వాహనం ఢీకొన్నది. దీంతో సాయాగౌడ్‌కు, శకుంతలకు తీవ్ర గాయాలు కావడంతో బాన్సువాడ ఆస్పత్రికి స్థానికులు తరలిస్తుండగా మార్గమధ్యలో శకుంతల మృతి చెందింది. సాయాగౌడ్‌కు రెండు కాళ్లు విరగడంతో బాన్సువాడ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం సాయాగౌడ్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ పోలీసులు తెలిపారు.


