
రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు
● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్
కామారెడ్డి క్రైం: ‘సాక్షి’ దినపత్రికలో కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు అనే శీర్షికతో ఆదివారం(ఈ నెల 19న) ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధారి మండలంలో మొత్తం 38 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇంకా రావడం లేదని, 5 కేంద్రాలకు మాత్రమే ధాన్యం కుప్పలు వచ్చాయన్నారు. తేమ శాతం నిబంధనల ప్రకారంగా లేకపోవడంతో రైతులు ధా న్యాన్ని ఆరబెడుతున్నారని తెలిపారు. అందుకే కాంటా ప్రారంభం కాలేదన్నారు. 7 కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో గన్నీ బ్యాగులు పంపలేదన్నారు. తొందర్లోనే అన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు.