
దేవుడి ముందు పెట్టిన దీపం అంటుకొని ఇల్లు దగ్ధం
బాల్కొండ: దేవుడి ఫొటోల ముందు ఉన్న దీపంతో ఇంటికి నిప్పు అంటుకొని కాలిపోయిన ఘటన మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మెండోరాలోని రాజారపు భార్గవి సోమవారం ఇంట్లో దేవుడి ఫొటోల ముందర దీపం ముట్టించింది. అనంతరం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లింది. కొంత సమయం తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గమనించి, ఇంటి తాళాలు పగలగొట్టారు. కానీ అప్పటికే ఇంట్లో సామగ్రి, నగదు కాలి బూడిదయ్యాయి. విషయం తెలసుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ చారి ఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం కింద రేషన్ బియ్యాన్ని అందించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.