
పార్టీ కోసం పనిచేసేవారికే పదవులు
నిజామాబాద్ సిటీ: డీసీసీ, సీసీసీ అధ్యక్ష పదవులను త్వరలో భర్తీచేస్తామని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు కట్టబెడతామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్‌లో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఖాళీగా ఉన్న పదవులన్నింటిని ఏఐసీసీ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో డీసీసీ, సీసీసీ పోస్టులను ముందుగా భర్తీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకుల అభిప్రాయలను సేకరిస్తామని, ఇప్పటికే బ్లాక్ లెవల్ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. వారం రోజులపాటు జిల్లాలో ఉండి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు రిజ్వాన్ తెలిపారు. ఈనెల 14న బోధన్‌లో, 15న ఆర్మూర్‌లో, 16న బాల్కొండ, 17న నిజామాబాద్ రూరల్‌లో, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కె నగేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ యాదగిరి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరి అభిప్రాయాలను
పరిగణలోకి తీసుకుంటాం
నియోజకవర్గాల వారీగా పర్యటిస్తా
ముందుగా డీసీసీ, సీసీసీ పోస్టుల భర్తీ
ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్యే
రిజ్వాన్ అర్షద్