
మక్క కొనుగోళ్లకు ఏర్పాట్లు!
● 26 సెంటర్లను ఖరారు చేసిన
అధికారులు
● ఇక ప్రభుత్వ ఆదేశాలే తరువాయి
డొంకేశ్వర్ మండలం తొండాకూర్ శివారులో
మక్కలను ఆరబెడుతున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మక్క కొనుగోళ్లకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్ని సెంటర్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు చేసిన అధికారులు.. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో 26 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టనుండగా సహకార సంఘాల ద్వారా మక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన సొసైటీల్లో ఈ–పాస్ యంత్రాలను అందుబాటులో పెట్టుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులు సహకార శాఖకు లేఖ రాశారు. అయితే మక్క కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల ప్రకటన చేయడంతో రెండు, మూడు రోజుల్లో జీవో ద్వారా ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు రాగానే కేంద్రాలను తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని సొసైటీ సీఈవోలకు సూచించారు.
కేంద్రాల్లోనే మద్ధతు ధర
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కుగాను 52,093 ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. సుమారు 1.45లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట కోతలు మొదలై 20 రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో వేచి చూసే పరిస్థితి లేక క్వింటాల్‌కు రూ.2,100 రేటు వచ్చినా రైతులు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2,420 మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మద్ధతు ధరను పొందలేకపోతున్నారు. మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తి కాగా, మార్కెట్‌లో 40 శాతం మక్కలు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే వ్యాపారులు మరింత తక్కువ ధరకు కోనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
మక్కలను కొనుగోలు చేసేందుకు జిల్లాలో సెంటర్లను ఎంపిక చేశాం. సొసైటీల ద్వారా రైతుల నుంచి మక్కలను కొంటాం. ప్రభుత్వం నుంచి రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయి. రాగానే కేంద్రాలను తెరుస్తాం.
– దాసోజు మహేశ్, మార్క్‌ఫెడ్ డీఎం