
అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు
● ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు
ఎదురైతే అధికారులదే బాధ్యత
● వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా, ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా సాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ సందర్భంగా ఎక్కడైనా రైతులు ఆందోళనలకు దిగితే సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పచ్చి ధాన్యం కోయకుండా రైతులు, హార్వెస్టర్ల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్‌లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్‌రావు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.