
ఎస్సారెస్పీలోకి మళ్లీ పోటెత్తిన వరద
● నాలుగు గేట్ల ద్వారా
12,500 క్యూసెక్కుల నీటి విడుదల
● నిండుకుండలా శ్రీరాంసాగర్
వరద గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద ఆదివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ పోటెత్తింది. ప్రాజెక్ట్‌లోకి గరిష్టంగా 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 16 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికి క్రమంగా ఇన్‌ఫ్లో 34 వేల 709 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువకు నీటి విడుదలను తగ్గించారు. 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి సమయానికి ఇన్‌ఫ్లో మరింత తగ్గి 23 వేల క్యూసెక్కులకు పడిపోవడంతో నాలుగు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్‌గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్‌నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.