
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
బోధన్: పేదలు, బాధిత కుటుంబాలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. పట్టణంలో లయన్స్ కంటి ఆస్పత్రి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు హర్షణీయమన్నారు. పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి రోగులకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన నూతన వాహనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ప్రజాప్రతినిధులు, క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం బోధన్ మండలంలోని హంగర్గ ప్రభుత్వ పాఠశాలలు, జీపీ కార్యాలయానికి లయన్స్ క్లబ్ వితరణ చేసిన ఫర్నీచర్‌ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రైస్‌కుక్కర్లను క్లబ్ వితరణ చేయగా ఎమ్మెల్యే అంగన్‌వాడీ టీచర్లకు అందించారు. పట్టణంలోని శక్కర్‌నగర్‌కు చెందిన విద్యార్థి ప్రణయ్ సాయి ఐఐటీలో సీటు సాధించగా క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థి తల్లిదండ్రులకు ల్యాప్‌టాప్ అందజేశారు. అంగన్‌వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ చిన్నారులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కంటి ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్‌రావు, చైర్మన్ నర్సింహారెడ్డి, ప్రతినిధులు లక్ష్మి, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్‌రెడ్డి, నిజామాబాద్ ఏఎంసీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, సీడీపీవో పద్మ, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, క్లబ్ ప్రతినిధులు సుబ్బారావు, ప్రతాప్‌గుప్తా, నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం