
ఆలయాల దోపిడీ ముఠా సభ్యుల అరెస్టు
క్రైం కార్నర్
● ఆటో, నగదు, వెండి వస్తువుల స్వాధీనం
● సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల గుర్తింపు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి టౌన్: ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులలో ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 10న భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో పెద్దమ్మ గుడి హుండీలో నుంచి రూ.5వేలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అలాగే ఎల్లమ్మ గుడి, ముత్యాలమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి హుండీల డబ్బులను చోరీ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. వారిని పట్టుకుని విచారించగా పలు చోరీల వివరాలు బయటకు వచ్చాయి. హైవేపై ఉన్న ఇళ్లు, ఆలయాలను టార్గెట్ చేసుకుని తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు చోరీలకు పాల్పడుతున్నటు గుర్తించారు. అలాగే గత నెల 19న రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లన్న గుడి, సదాశివనగర్ మండలంలో ఎల్లమ్మ గుడి, ఈ నెల 9న రామాయంపేట పరిధిలోని అయ్యప్ప ఆలయంలో హుండీలోని నగదు, వెండి పూజ సామగ్రి దొంగిలించారు. అదేరోజు భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో హుండీలో నగదు, అమ్మవారి వెండి కళ్లు చోరీ చేశారు. పక్కనే ఉన్న ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు. జంగంపల్లి గ్రామంలో పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో హుండీ డబ్బులు దొంగలించారు. బస్వాపూర్, రామాయంపేట్‌లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులలో ముగ్గురిని సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన గాంధారి సత్యం, మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన సయ్యద్ సమీర్, అహ్మద్ పఠాన్‌గా గుర్తించారు. సత్యం, సమీర్ పట్టుబడగా, అహ్మద్ పఠాన్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు ఫోన్లు, ఆటో, మూడు జతల అమ్మవారి వెండి కళ్లు, వెండి దీపాలు, వస్తువులు, రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయాల దోపిడీ ముఠా సభ్యుల అరెస్టు