
‘రైతు డిక్లరేషన్’ హామీలు నెరవేర్చాలి
● మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రకారం మొక్కజొన్న పంటకు మెరుగైన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన వేల్పూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు కొనుగోలుదారుల చేతుల్లో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. క్వింటాలుకు రూ. 2400 ఉన్న మద్దతు ధరకు మెరుగైన మద్దతు ధర రూ. 400 కలిపి క్వింటాలుకు రూ. 2800 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రూ. 2800 లకు మక్కలు కొనాలని, కానీ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులు రూ. 1800కు కూడా కొనడం లేదన్నారు. వర్షాలు కురుస్తున్నందున వ్యాపారులు ధరను ఇంకా తగ్గించే అవకాశం ఉందన్నారు. దీంతో ఎకరానికి సుమారు 30 క్వింటాళ్ల మక్కలు పండించే రైతులు రూ. 30 వేలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కోరారు. సోయాబీన్ పంట కూడా కోత దశలో ఉన్నందున కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుగా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ను కోరారు. మొక్కజొన్నకు వచ్చిన పరిస్థితులు సోయాబీన్‌కు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.