
సార్లూ.. ఇదేమి పాడు బుద్ధి
● నగరంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నెలక్రితం ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన లెక్చరర్, విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసులో లెక్చరర్ జైలు పాలయ్యాడు.
ఖలీల్‌వాడి: విద్యార్థులకు చదువు, సంస్కారం నే ర్పాల్సిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మంచీ చెడు చెప్పాల్సిన వారే సమాజంలో తలదించుకునే పనులు చేస్తున్నారు. వెకిలి చేష్టలతో కీచకులుగా మారుతున్నారు. తండ్రి లాంటి వ యస్సులో ఉన్న వారు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ పవిత్రమైన వృత్తికి కళంకం తెచ్చిపెడుతున్నారు. కాగా, కొంతమంది పిల్లలు తమకు జరిగిన ఘటనలను తల్లిదండ్రులకు వివరించినా, మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు చేస్తున్న ఈ చేష్టలతో మిగతా టీచర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇటీవల జిల్లాలో వరుసగా విద్యార్థినులపై గురువుల అఘాయిత్యాలు పెరగడంతో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. టీచర్లు ఇలా ప్రవర్తించడంతో ఎవరిని నమ్మాల్లో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి తల్లిదండ్రుల్లో నెలకొంది.
శిక్షలు పడుతున్నా..
పోక్సో కేసు నమోదైన తర్వాత పోలీసులు ఆరు నెలల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. జిల్లాలో పోక్సో కోర్టు అందుబాటులో ఉండటంతో కేసుల విచారణ త్వరగా జరిగి శిక్షలు పడుతున్నాయి. పోక్సో కేసులలో దోషులకు 20 ఏండ్ల వరకు శిక్ష ఖరారు అవుతుంది. 2022 సంవత్సరం నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 322 పోక్సో కేసులు నమోదు కావడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
తల్లిదండ్రుల చేతుల్లో బాలికల భద్రత
● బాలికల తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది.
● ఇంటి పరిసర ప్రాంతాలు, పాఠశాలల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా? అని అడిగి తెలుసుకోవాలి.
● గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే చాక్లెట్లు, మిఠాయిలను సున్నితంగా తిరస్కరించేలా పిల్లలకు అవగాహన కల్పించాలి.
● ఎదుగుతున్న పిల్లలను మగవారితో సన్నిహితంగా మెలగనివ్వొద్దు. ఇంటి పక్కవారు, బంధువులతో పిల్లలను సినిమాలు, షాపింగ్, పర్యాటక ప్రాంతాలకు పంపొద్దు.
పోక్సో కేసుల వివరాలు
నెలక్రితం నగరంలోని ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, జైలుకు పంపారు.
అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులే..
విద్యార్థినులను బ్యాడ్ టచ్ చేయొద్దు. శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తే పోక్సో కేసు నమోదు చేస్తాం. స్కూల్స్, కాలేజీల్లో షీటీమ్స్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, కాలేజీల్లో కమిటీ ఏర్పాటు చేశాం. స్కూల్ యాజమాన్యం, ప్రధానోపాధ్యాయుల దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే వారు కూడా శిక్షార్హులే. – రాజావెంకట్‌రెడ్డి,
ఏసీపీ, నిజామాబాద్
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరు గురువులు
జిల్లాలో ఇటీవల వెలుగులోకి
పలు ఘటనలు
పలువురిపై పోక్సో కేసులు
ఆందోళనలో తల్లిదండ్రులు