
ఆన్‌లైన్ షాపర్స్ లక్ష్యంగా..
● తాజాగా నిజామాబాద్‌లో
ఇలాంటి పార్శిల్స్ డెలివరీ
● డబ్బులు చెల్లించి పార్శిల్ విప్పితే,
అందులో చిల్లర వస్తువులు..
● వాట్సాప్ గ్రూపుల్లోకి సైతం చొరబడుతున్న వైనం
● బాధితుల సిమ్‌ను, వాట్సాప్‌ను
ఆధీనంలోకి తీసుకుంటున్న మాయగాళ్లు
సైబర్ కేటుగాళ్లు రోజు రోజుకూ కొత్త కొత్త విధానాలతో మోసాలు చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పలువురి ఖాతాలకు చిల్లులు పెడుతున్నారు. ఇలా కూడా సైబర్ నేరాలు చేస్తారా అనేవిధంగా సైబరాసురులు ఊహించని రీతిలో మోసాలకు దిగుతున్నారు. ప్రస్తుత గ్లోబల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి సింపుల్‌గా సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిఒక్కరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.
– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
అడ్రస్‌లు చోరీ చేసి పార్శిల్స్
పంపిస్తున్న సైబర్ కేటుగాళ్లు
● ఇటీవల నిజామాబాద్‌కు చెందిన పలువురు ఉపయోగిస్తున్న వాట్సాప్ గ్రూపును సైతం తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా మోసం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఏకంగా పర్సనల్ ఫోన్ కాంటాక్ట్ నంబర్ల ద్వారా బాధితుల బంధు వులు, స్నేహితులతో నే రుగా చాటింగ్‌లోకి వెళుతున్నారు. ఇలా హ్యాక్ చేసిన ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.
నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారస్తుడికి ఇటీవల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పార్శిల్ వచ్చింది. ఈ వ్యాపారి ఆన్‌లైన్ షాపింగ్‌లో తన ఇంటిలో అవసరమైన గృహోపకరణం కోసం ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన డెలివరీ రాకపోగా, ఓ కొరియర్ సంస్థ ద్వారా ఈ నెల 11న తన ఇంటి చిరునామాకు పార్శిల్ వచ్చింది. నగదు చెల్లించి పార్శిల్ తీసుకుని దాన్ని తెరవగా అందులో వాడేసిన చిన్న ఖాళీ నెయిల్ పాలిష్ సీసా, నీళ్లతో నింపిన చిన్న స్ప్రేబాటిల్ ఉంది. అయితే ఈ పార్శిల్‌పై హైదరాబాద్‌లోని నారాయణగూడ ఏరియాకు చెందిన వ్యక్తి చిరునామా ఉంది. ఈ చిరునామా పైభాగంలో నిజామాబాద్ సుభాష్‌నగర్‌కు చెందిన సదరు వ్యాపారి అడ్రస్ స్లిప్ అతికించి మరీ పార్శిల్ డెలివరీ చేయడం గమనార్హం. అయితే తాను ఆర్డర్ చేసిన వస్తువు వచ్చిందని నగదు చెల్లించి తీసుకున్న వ్యాపారి మోసపోయినట్లు తెలుసుకుని అవాక్కయ్యాడు. కొరియర్ సంస్థ వాళ్లను వాకబు చేస్తే హర్యానా నుంచి వచ్చినట్లు చెప్పడం గమనార్హం. అయితే ఈ మోసం చుట్టుపక్కల నుంచే చేసినట్లు అర్థమవుతోంది.
● ఇటీవల నగరానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి వాట్సప్‌కు సైబర్ కేటుగాళ్లు ఓ లింక్‌ను పంపారు. ఈ వాట్సప్ ఉన్నది ఆపిల్ ఐఫోన్ కావడం గమనార్హం. ఈ ప్రజాప్రతినిధి ఫోన్‌తో పాటు అన్ని యాప్‌లు ఫేస్ ఐడీతో ఓపెన్ అవుతాయి. అయితే వాట్సప్ కూడా అలా ఓపెన్ చేసి కొత్తగా వచ్చిన ఓ లింక్‌ను క్లిక్ చేశారు. తక్షణమే సదరు వాట్సాప్‌తో పాటు ఫోన్‌లోని సిమ్ పూర్తిగా సైబర్ నేరగాడి ఆధీనంలోకి వెళ్లిపోయింది. బాధిత ప్రజాప్రతినిధి ఎవరికీ ఫోన్ చేయలేని, ఎవరి వద్ద నుంచీ ఫోన్‌కాల్స్ రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటిలోనే కేటుగాళ్లు వాట్సప్ ద్వారా సదరు మాజీ ప్రజాప్రతినిధి కాంటాక్ట్ నంబర్లలోని 90 మందితో ఛాటింగ్‌లోకి వెళ్లారు. అప్పటికే వాట్సాప్ మొత్తం కేటుగాడి ఆధీనంలో ఉండడంతో బంధువులెవరు, స్నేహితులెవరు అనే విషయాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా చాటింగ్ చేయడం విశేషం. ఇలా ప్రతిఒక్కరికి చాటింగ్‌లో అత్యవసరంగా రూ.42 వేలు కావాలంటూ మెసేజ్ చేశాడు. ఇలా మెసేజ్ అందుకున్నవారిలో ముగ్గురు వ్యక్తులు సదరు ప్రజాప్రతినిధి ఫోన్‌పేకు డబ్బులు పంపారు. ఈ డబ్బులు నేరుగా సైబర్ కేటుగాళ్ల ఖాతాల్లో చేరిపోయాయి. గంటలోపే అప్రమత్తమైన సదరు మాజీ ప్రజాప్రతినిధి తన సిమ్‌ను డీయాక్టివేట్ చేయించడంతో సైబర్ కేటుగాళ్ల మోసానికి బ్రేక్ వేయించగలిగారు.
డెలివరీ పార్శిల్ వచ్చిందని..
కొందరు ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడు సైతం సైబర్ కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. షాపింగ్ చేయనివారికి సైతం పార్శిల్ వచ్చిందని, బయట డెలివరీ బాయ్ వెయిట్ చేస్తున్నాడని, ఓటీపీ చెప్పాలని కేటుగాళ్లు అడుగుతున్నారు. ఇలా చెప్పినవారి కాల్స్‌ను సైతం ఫార్వర్డింగ్ చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్ షాపర్స్ లక్ష్యంగా..

ఆన్‌లైన్ షాపర్స్ లక్ష్యంగా..

ఆన్‌లైన్ షాపర్స్ లక్ష్యంగా..