
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ రాజమార్గం
నిజామాబాద్ లీగల్ : కేసుల సత్వర పరిష్కారంలో లోక్ అదాలత్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ మూడో లోక్ అదాలత్‌ను జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సంస్థ ప్రాంగణంలో శనివారం జడ్జి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాజీమార్గమే –రాజమార్గం అన్న నినాదంతో ప్రారంభమైన లోక్ అదాలత్‌లు అనేక పెండింగ్ కేసులకు ముగింపు పలికాయన్నారు. కోర్టుల చుట్టూ ఏళ్లపాటు తిరిగే బదులు కక్షిదారులు తమ కేసుల్ని లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకుని మానసిక ప్రశాంతతను పొందవచ్చని వివరించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెరగడంతో జిల్లా న్యాయసేవా సంస్థ లోక్ అదాలత్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారని, ఇది పెండింగ్ కేసుల పరిష్కారంలో ముందడుగని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి విజయభాస్కర్ రావు, నాల్గో అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి హరీష, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జీవీఎన్ భారతలక్ష్మి
మూడో లోక్‌అదాలత్‌లో 26,390
పెండింగ్ కేసులు పరిష్కారం
రూ. 9.26 కోట్ల పరిహారం చెల్లింపు