
సొసైటీ డైరెక్టర్లపై వేటు!
● రుణాలు చెల్లించని వారిని పాలకవర్గాల నుంచి తొలగిస్తున్న సహకార శాఖ
● ఇప్పటి వరకు 20 మంది వరకు ఉద్వాసన
● పలుమార్లు నోటీసులిచ్చినా లెక్క
చేయకపోవడంతో చర్యలకు దిగిన అధికారులు
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని డైరెక్టర్లపై జిల్లా సహకార శాఖ చర్యలకు దిగింది. జిల్లా వ్యాప్తంగా పలు సొసైటీల్లోని దాదాపు 20 మంది డైరెక్టర్లపై అధికారులు వేటు వేశారు. వారి పదవితోపాటు పాలకవర్గం నుంచి పేరును అధికారులు తొలగించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
జిల్లాలో మొత్తం 89 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఇటీవల 60 సొసైటీలకు మాత్రమే పదవీకాలాన్ని ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మిగిలిన 29 సొసైటీలకు పొడిగింపు ఇవ్వలేదు. మొదటిసారి పెంచిన సమయంలో బకాయిలున్న డైరెక్టర్ల జోలికి వెళ్లలేదు. ఇటీవల రెండోసారి పెంచిన సమయంలో మాత్రం రుణాలు తీసుకొని డీఫాల్టర్ల కింద ఉన్న డైరెక్టర్ల పేర్లను ప్రభుత్వం అధికారుల ద్వారా సేకరించింది. అవినీతి జరిగిన సొసైటీల వివరాలు, పాలకవర్గంలో ఉండి రుణాలు కట్టని వారి పేర్లను కూడా ప్రభుత్వానికి పంపారు. ఇదేదో సాధారణంగా తీసుకుంటున్న డేటానేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఈ విధంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్, ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయితోపాటు నల్లవెల్లి, నందిపేట్‌లో చింరాజ్‌పల్లి, ఇతర మండలాల్లోని సొసైటీల్లో డీఫాల్టర్లుగా ఉన్న డైరెక్టర్లకు ఉద్వాసన పలికారు. అయితే, పెద్ద మొత్తంలో రుణాలు పొంది వాటిని తిరిగి కట్టని మరికొన్ని సొసైటీలకు సంబంధించిన డైరెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రైతులకో తీరు..డైరెక్టర్లకో తీరా!
రైతుల అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన సొసైటీల్లో డైరెక్టర్లు సొంత లాభాపేక్షను చూసుకుంటున్నారనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. రైతులు రుణాలు తీసుకొని కట్టపోతే అధికారులు వారి ఇంటికి నోటీసులు పంపడమే కాకుండా ఆస్తులను జప్తు చేస్తున్నారు. కానీ, పాలకవర్గ పదవీలో ఉంటూ రూ.లక్షల్లో రుణాలు తీసుకొని ఏళ్ల తరబడి సక్రమంగా చెల్లించని డైరెక్టర్లను ఏమీ అనకపోవడంతో గత కొంతకాలంగా రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకో తీరు... డైరెక్టర్లకో తీరా అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో డీఫాల్ట్ డైరెక్టర్లకు పలుమార్లు నోటీసులు పంపించారు. సమయం ఇచ్చినా వారు లెక్క చేయకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించి పదవి నుంచి తొలగించడం ప్రారంభించారు. కాగా, తొలగింపబడిన వారి నుంచి బకాయిలను వసూలు చేసేందుకు లీగల్ పద్ధతిలో వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే, పదవిని కోల్పోయిన డైరెక్టర్లు పాలకవర్గంలో తిరిగి చేరేందుకు పైరవీలు మొదలుపెట్టారు. రాజకీయ నేతలతో అధికారులకు ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. డీఫాల్ట్ డైరెక్టర్ల తొలగింపు విషయమై జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్‌రావును సంప్రదించగా చర్యలు వాస్తవమేనని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.