
కొడంగల్ లెక్కనే అభివృద్ధి జేస్త..
‘‘ఎన్నడూ లేనంత వరదలతో వాటిల్లిన ఇబ్బందులను చూసి ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడిదాకా వచ్చా. మీకు
జరిగిన నష్టాన్ని చూశా. మళ్లీ ఇలాంటి సమస్య ఎదురు కావొద్దు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. అందుకోసం అవసరమైన నిధులు ఇస్తా. అధైర్యపడకండి అండగా ఉంటా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం.. వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెనలు, ఇళ్లను
పరిశీలించారు. బాధితులను కలిసి వారి గోడును విన్నారు. ‘‘మీ కష్టాలు తీర్చడానికే వచ్చా’’నంటూ వారికి భరోసా
ఇచ్చే ప్రయత్నం చేశారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ లింగంపేట
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌నుంచి హెలీకాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. లింగంపేట మండలంతోపాటు కామారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులందరూ సమన్వయంతో ముందుకువెళ్లడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. వరదలు వచ్చిన రోజునే మంత్రి సీతక్క, ఎంపీ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీలకు ఫోన్ చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించానన్నారు. వరద సహాయక చర్యల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కృషి చేశారన్నారు. వరదల్లో పిల్లల పుస్తకాలు తడిచిపోయాయని చెప్పారని, కాంటింజెన్సీ ఫండ్ నుంచి వి ద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే ఫార్మా కంపెనీలు, బీడీ పరిశ్రమలతో మాట్లాడి వారి సహకారంతో కాలనీ వాసులను ఆదుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూ చించారు. ‘‘కంపెనీలు ఇచ్చే సాయం తీసుకోండి, ఇంకా ఏది కావాలన్నా నేను ఇస్తా’’ అని అన్నారు.
వందేళ్ల కింద కట్టినా..
పోచారం ప్రాజెక్టును 103 ఏళ్ల కిందట రూ. 26 లక్షలతో నిర్మించినా అది ఇంతటి వరదలను తట్టుకుని నిలబడడం మజ్‌బూత్‌గా ఉందన్నారు. జిల్లాలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు అన్ని మరమ్మతులు చేయిస్తానన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ‘‘మంచిగా ఉన్నపుడు కాదు, కష్టం వచ్చినపుడు వెన్నంటి నిలబడేవాడే నాయకుడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచారు’’ అంటూ అభినందించారు.
ఒక్కో శాఖపై సుదీర్ఘంగా సమీక్ష
కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం దాదాపు గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో మొదట ఫొటో ప్రదర్శనను తిలకించిన అనంతరం భోజనం చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వరదలతో జరిగిన నష్టం, చేసిన పనిని వివరించారు. ఈ సందర్భంగా సీఎంఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఎన్‌పీడీసీఎల్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, వ్యవసాయం, నీటి పారుదల శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు, సు దర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికా రి రాజీవ్‌గాంధీ హన్మంతు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షు డు కైలాస్ శ్రీనివాస్‌రావ్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
జీఆర్ కాలనీ ముంపు సమస్యకు
శాశ్వత పరిష్కారం చూపుతాం
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
లింగంపల్లి కుర్దు, బూరుగిద్ద,
కామారెడ్డిలలో పర్యటన
వరదలతో దెబ్బతిన్న పంటలు,
వంతెన, రోడ్ల పరిశీలన
బాధితులకు భరోసా కల్పించిన సీఎం
‘‘ఎన్నికల సమయంలో చెప్పినట్లే కొడంగల్‌తో సమానంగా కామారెడ్డిని చూస్తా.. అభివృద్ధి చేస్తా. ఏ సమస్య ఉన్నా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకురండి. ఆయన సహకారంతో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తా. కామారెడ్డిలో ఏ కష్టమొచ్చినా ఆదుకునే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కొడంగల్ లెక్కనే అభివృద్ధి జేస్త..

కొడంగల్ లెక్కనే అభివృద్ధి జేస్త..