
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
● తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన
పనులను విభజించాలి
● వరద నష్టం ప్రభుత్వానికి నివేదిస్తాం
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
సిరికొండ : వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూ ర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారుల ను ఆదేశించారు. మండలంలోని కొండూర్ వద్ద కప్పలవాగుపై తెగిపోయిన వంతెన, రోడ్డును, పెద్ద వాల్గోట్ వద్ద కోతకు గురైన రోడ్డును, ఇసుక మేట లు వేసిన పొలాలను, ధ్వంసమైన విద్యుత్ స్తంభా లను, ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన గురువారం పరిశీలించారు. తక్షణమే చేపట్టాల్సిన పనుల జాబితాలో కొండూర్ రోడ్డును చేర్చి, వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే చేపట్టాల్సిన, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను విభజించి ప్రాధాన్యతా క్రమంలో చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. పెద్దవాల్గోట్‌లో కొనసాగుతున్న రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. వరద నష్టంపై సమగ్ర వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. అనంతరం పెద్దవాల్గోట్‌లో సొసైటీ గోదాముతోపాటు పల్లె దవాఖానను, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పీఆర్ ఈఈ శంకర్‌నాయక్, డీఈ హైమద్ హుస్సేన్ తదితరులున్నారు.