
నీటిని ఎత్తిపోసేదెలా?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 1045 అడుగులు నీటి మట్టం వద్ద నిర్మించిన లక్ష్మి ఎత్తిపోతల పథకం సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు నెలరోజుల క్రితం చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్, ఆయిల్‌ను ఎత్తుకెళ్లారు. అయినా ఇప్పటికీ వాటి స్థానంలో కొత్త వాటిని అధికారులు ఏర్పాటు చేయలేదు.
నీటి విడుదలకు డిమాండ్..
లక్ష్మి హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రాజెక్ట్ నీటి మట్టం 1064 వరకే సరఫరా జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ నుంచి నీటిని లక్ష్మి లిప్ట్ ద్వారా లిప్టు చేసి కాలువ హెడ్ రెగ్యులేటర్ వరకు సరఫరా చేయాలి. కానీ విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. ప్రస్తుతం వర్షభావ పరిస్థితుల వలన ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదలకు డిమాండ్ పెరుగుతుంది. ఈనేపథ్యంలో నీటి విడుదలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మి లిప్టును నిర్మాణం చేపట్టిన కంపెనీ ఇప్పటికీ ప్రాజెక్ట్ అధికారులకు అప్పగించలేదు. దీంతో ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్లను బిగించే బాధ్యత కంపెనీ వారే చూసుకోవాలి. రికవరీ కోసం అధికారులు కంపెనీ ప్రతినిధులకు లేఖలు రాశారు. కానీ ఇంకా అమలులోకి రావడం లేదు. ప్రాజెక్ట్ అధికారులు ఆ లిఫ్ట్‌ను మైనర్ ఇరిగేషన్ బాల్కొండకు అప్పగించారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు బిగించేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
లక్ష్మి ఎత్తిపోతల పథకం విద్యుత్
సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ
నెలరోజులు గడిచినా కొత్తవాటిని ఏర్పాటు చేయని వైనం
ట్రాన్స్‌ఫార్మర్ వెంటనే బిగించాలి..
లక్ష్మి లిఫ్ట్ సబ్‌స్టేషన్‌లో చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో వెంటనే కొత్త వాటిని బిగించాలి. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో నారు మడులు ఎండిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి, నీటి విడుదల చేపడితే నారు మడులను కాపాడుకుంటాం.
– గంగారెడ్డి, ఆయకట్టు రైతు, ముప్కాల్
త్వరలోనే బిగిస్తారు..
సబ్‌స్టేషన్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ విషయాన్ని నిర్మించిన కంపెనీకి తెలియజేశాం. అంతేకాకుండ రికవరీ కోసం లెటర్ పెట్టాం. కంపెనీ వారు త్వరలోనే బిగిస్తామని తెలిపారు. లేదా ఓఅండ్‌ఎం నిధుల నుంచైన పనులు చేపిస్తాం.
– ప్రవీణ్‌రెడ్డి, ఏఈఈ,
మైనర్ ఇరిగేషన్, బాల్కొండ.

నీటిని ఎత్తిపోసేదెలా?