
జిట్టపులి దాడిలో లేగదూడ మృతి
సిరికొండ: మండలంలోని పాకాల శివారులో జిట్ట పులి (లియోపార్డ్) దాడిలో లేగ దూడ మృతి చెందినట్లు అటవీశాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. మృతి చెందిన లేగ దూడ పాకాల గ్రామానికి చెందిన తేజావత్ బాబుకు చెందినదన్నారు. ఉమ్మడి జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారం నేపథ్యంలో ఘటన స్థలాన్ని డీఎఫ్‌వో నిఖిత, ఆర్మూర్ ఎఫ్‌డీవో భవాని శంకర్, యానిమల్ ట్రాకర్స్, రేంజ్ సిబ్బంది సందర్శించారు. లేగ దూడను పెద్దపులి కాదని జిట్ట పులి చంపినట్లు నిర్దారించారు. లేగ దూడ కళేబరానికి పశు వైద్య శాఖ అసిస్టెంట్ సర్జన్ పోస్టు మార్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం పాడి రైతుకు అటవీ శాఖ ద్వారా నష్ట పరిహారం చెల్లిస్తామని డీఎఫ్‌వో తెలిపారు. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న ప్రజలు అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లవద్దని ఆమె సూచించారు. పశువుల కాపరులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపే అడవిలోకి కొద్ది దూరం మాత్రమే వెళ్లి తిరిగి రావాలన్నారు. పొలాల్లో పనులకు వెళ్లేటప్పుడు గుంపులుగా, పెద్ద శబ్దాలు చేస్తు వెళ్లాలన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని వన్యప్రాణులకు ప్రాణహాని కలిగించినచో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.