
‘నిజాంసాగర్’ నీటిని విడుదల చేయాలి
బోధన్: నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువకు నీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద నిజామాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డుపై ఎడపల్లి, బోధన్ మండలాల్లోని ఆయకట్టు రైతులు రాస్తారోకో నిర్వహించారు. డి–46 కాలువ ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలాల్లో విస్తరించి ఉండగా, ఈ కాలువ కింద సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. రైతులు ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేశారు. వర్షాలు పడకపోవడం వల్ల కాలువ నీటి ఆధారంగా సాగు చేసిన వరి పైరు ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై రమా, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.