
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వినయ్ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి వాగు నుంచి ఇసుకను తోడి జన్నెపల్లి వైపు వెళ్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే శుక్రవారం వేకువ జామున వాగు నుంచి ఇసుకతో బయటకు వస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
మాక్లూర్ మండలంలో..
మాక్లూర్: మండలంలోని మాణిక్‌భండార్ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను శుక్రవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని మాక్లూర్ పోలీసులకు అప్పగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచి, టిప్పర్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇసుకతో ఉన్న టిప్పర్ తమ ఆధీనంలో ఉందని తదుపరి చర్యల కోసం విచారణ చేపట్టినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
ఫారెస్ట్ అధికారుల అడ్డగింత
వర్ని: వర్ని ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సిద్ధాపూర్ అ టవీ ప్రాంతంలో గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను శుక్రవారం అటవీశాఖ అధికారులు ధ్వంసం చేయడానికి యత్నించారు. విషయం తెలుసుకున్న గిరిజనులు వెంటనే వారిని అడ్డుకున్నారు. సుమారు 15 ఎకరాల స్థలంలో గిరిజనులు మొక్కజొన్న పంట వేయగా అటవీ భూమిని కబ్జా చేస్తున్నారని అధికారులు పేర్కొంటూ, ధ్వంసం చేయడానికి యత్నించారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత