
కేంద్రం వాటా కోసం తంటాలు
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికై న వారి వివరాలను మరోమారు సేకరించడానికి పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలంటే మరోమారు సర్వే నిర్వహించాల్సి ఉందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
ఈసారి ఆవాస్ ప్లస్ 2024 యాప్‌లో..
2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి అంతే మొత్తంలో ఇళ్ల నిర్మాణంకు ఆమోదం తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కేంద్రం వాటా కూడా ఉండాలంటే ఆ ప్రభుత్వం సూచించిన విధంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలి. గతంలో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయగా, ఈసారి ఆవాస్ ప్లస్ 2024 యాప్ ద్వారా పీఎంఏవై–జీలో నమోదు చేయాల్సి ఉంది. మూడు రోజులుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వద్దకు వెళ్లి కేంద్రం వాటా కోసం ఉద్యోగులు వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా వాటా నిధుల కోసం పీఎంఏవై సర్వే తప్పనిసరి అయ్యింది. ప్రతి కార్యదర్శి, వార్డు అధికారి లబ్ధిదారు ఇంటికి వెళ్లి 15 అంశాలపై వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.
బ్యాంకుల వివరాల్లో గందరగోళం..
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబ్బులు జమ చేయడానికి లబ్ధిదారుల ఖాతాల నంబర్లు గతంలో సేకరించారు. ఏ బ్యాంకు ఖాతా అయినా లబ్ధిదారులకు విడతల వారిగా సొమ్ము జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పీఎంఏవైకి సంబంధించి కొన్ని బ్యాంకు ఖాతాల నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సర్వే నిర్వహిస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. ఒకటి, రెండు జాతీయ బ్యాంకుల ఖాతాల వివరాలను మాత్రమే యాప్‌లో అప్‌లోడ్ చేయగలుగుతున్నామని గ్రామీణ, సహకార, ఇతర బ్యాంకుల ఖాతాల నంబర్లు నమోదు చేస్తే సర్వే పూర్తి కావడానికి ఇబ్బంది కలుగుతుందని సిబ్బంది వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ బ్యాంకు ఖాతా అయినా అంగీకరించగా, కేంద్రం మాత్రం కొన్ని జాతీయ బ్యాంకుల ఖాతాల వివరాలనే ఆమోదించడం గమనార్హం. ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తేనే కేంద్రం వాటా కోసం నిర్ధేశించిన సర్వే పూర్తవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై
మరోమారు సర్వే
పీఎం ఆవాస్ యోజన పథకం నిధుల కోసమేనంటున్న అధికార యంత్రాంగం
ఎలాంటి ఆటంకం లేకుండా సర్వే
కేంద్రం వాటా రాబట్టుకోవడానికి మరోసారి సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఈ సర్వే కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా సర్వే జరుగుతుంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే విడతల వారీగా డబ్బులు జమ చేయడానికి బిల్లులు తయారు చేస్తున్నాం.
– నర్సింహా రావు,
డీఈ, గృహ నిర్మాణ సంస్థ