
రాజకీయ రగడ
● స్థానిక వేడి..
● వేల్పూర్‌లో ఉద్రిక్త వాతావరణానికి పునాది వేసిన కాంగ్రెస్,
బీఆర్‌ఎస్ పార్టీలు
● బాల్కొండ నియోజకవర్గంలో
దూకుడు ప్రదర్శించిన ఇరుపార్టీలు
● ఫ్యాక్షన్ మాదిరిగా రాజకీయాలు చేసే ప్రయత్నాలంటూ పరస్పర విమర్శలు
● పోలీసుల పకడ్బందీ చర్యలతో
రగడకు విరామం
● మరోసారి పరస్పర విమర్శలు
చేసుకున్న మానాల, వేముల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక ఎన్నికల వాతావరణం సమీపిస్తున్న నేపథ్యంలో పసుపు నేలగా వెలుగొందుతున్న బాల్కొండ నియోజకవర్గంలో సై అంటే సై అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు ఢీకొట్టుకుంటున్నాయి. ఎవరికివారు తగ్గేదే లేదంటూ మాటల మంటలతో చెలరేగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలు నిప్పులు చెరిగేలా మాటలు మాట్లాడుతుండడంతో ఇరు పార్టీల శ్రేణులు మాత్రం చేతల వరకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో గురువారం బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ కేంద్రంగా ఇరుపార్టీల కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమాలు కాక పుట్టించాయి. పోటాపోటీ ప్రకటనలు, చర్యలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను గమనించిన పోలీసులు ఒకరోజు ముందు నుంచే పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మాహన్‌రెడ్డిల వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇరు పార్టీల ద్వితీయ శ్రేణులు వేల్పూర్ మండల కేంద్రంలో గుమిగూడొద్దని, 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలు చేస్తూ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డిని నిజామాబాద్‌లోనే తన ఇంట్లో పోలీసులు కట్టడి చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లోనూ కొద్దిసేపు అలజడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డిని మోర్తాడ్‌లో గృహనిర్బంధం చేశారు. పోలీసుల పకడ్బందీ చర్యలతో రాజకీయ రగడకు ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్‌లైంది.
ఇతర నియోజకవర్గాలకు..
బాల్కొండ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి ఉన్న ఏకై క ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాత్రమే కావడంతో జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ ప్రశాంత్‌రెడ్డి మాత్రమే నిర్వహిస్తున్నారు. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు భీంగల్‌లో పర్యటించిన సందర్భంలోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మళ్లీ తాజాగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అలజడి వాతావరణం బాల్కొండ నియోజకవర్గంలో రోజురోజుకూ పెరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సమయంలో ఈ సెగ ఇతర నియోజకవర్గాలకు సైతం పాకే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోసారి మాటల మంటలు..
వేల్పూర్ కేంద్రంగా నెలకొన్న ఉద్రిక్తతల సెగను పోలీసులు చల్లార్చినప్పటికీ నేతల మాటల యుద్ధం మాత్రం మరోసారి సాగింది. రాజకీ యాలన్నాక విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎత్తిచూపితే దాడులకు దిగే పరిస్థితి సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తాజాగా ప్రకటన చేశారు. మానాల మోహన్‌రెడ్డి సవాల్ విసరడంతో పా టు దాడులకు దిగితే ప్రజలకు వచ్చే ప్రయోజనమేమిటని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో మానాల మోహన్‌రెడ్డి కేసీఆర్‌ను, తనను అనరాని మాటలన్నప్పటికీ ఇలాంటి దాడులకు దిగలేదని వేముల వ్యాఖ్యానించారు. మరోవైపు మానాల మోహన్‌రెడ్డి సైతం నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే వేముల, బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతురుణమాఫీ, రైతుభరోసా, సన్నధాన్యం బోనస్, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్న విషయమై చర్చకు పిలిస్తే ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్ పారిపోయారన్నారు. ప్రభుత్వంపై త ప్పుడు ఆరోపణలు చేయడమేమిటన్నారు. మేము అమలు చేస్తున్న పథకాలు, గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఇస్తున్న పరిహారం విషయమై మేము చెప్పేవి అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని, నిజమైతే ప్రశాంత్‌రెడ్డి ముక్కు నేలకు రాయాలన్నారు.
కేటీఆర్, హరీశ్‌రావుల లాగే ప్రశాంత్‌రెడ్డి తుచ్ఛమైన మాటలు మాట్లాడుతున్నారని మానాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మళ్లీ మరోసారి మాటల మంటలు రేపడంతో ఉద్రిక్తత చల్లారే పరిస్థితి కనిపించడం లేదు.

రాజకీయ రగడ

రాజకీయ రగడ

రాజకీయ రగడ