
ఇంటి మీదికి పోవడం సభ్యతా?
వేల్పూర్: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, వేల్పూర్ మండల కేంద్రంలో నా ఇంటిమీదికి కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేయడం సభ్యతనా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మానాల మోహన్‌రెడ్డి ఐడెంటిటీ కోసం నా ఇంటి మీదికి దాడికి వస్తే ప్రజలకు జరిగే లాభం ఏమిటని ప్రశ్నించారు. గల్ఫ్‌లో చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు, ఇంకా రానివారు నియోజకవర్గంలో ఉన్నారు. వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగానని స్పష్టం చేశారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అడగడం నా బాధ్యత అని, ఇందులో తప్పేముందని పేర్కొన్నారు. మీరు మా ఇంటికి దాడికి రావడమో, మావాళ్లు మీ ఇంటికి రావడమో, రాజకీయ సన్యాసం తీసుకోవడం లాంటివి టైంపాస్ డ్రామా కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీసే హక్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తనకు ఉంటుందని పేర్కొన్నారు.
బాల్కొండ ప్రజలు ఆలోచించాలి
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి