
మత్స ్యశాఖలో వసూళ్ల పర్వం!
● బైలా పేరిట అందినకాడికి
దండుకున్న వైనం
● జిల్లా అధికారితోపాటు
ఉద్యోగులపై ఆరోపణలు
● ఇద్దరు ఎమ్మెల్యేల దృష్టికి
తీసుకెళ్లిన మత్స్యకారులు
● రాష్ట్ర శాఖకూ వెళ్లిన ఫిర్యాదులు
● మందలించిన ఉన్నతాధికారులు
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లా మత్స్యశాఖలో వసూళ్ల పర్వం నడుస్తోంది. చేయి తడపనిదే ఏ పనీ జరగడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. బైలా లేని మత్స్య సహకార సంఘాల నుంచి అందినకాడికి దండుకున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లా అధికారితోపాటు శాఖలోని కొందరు ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు రాగా, ఇటీవల జిల్లాలోని ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు మత్స్య సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర శాఖకు సైతం ఫిర్యాదులు వెళ్లడంతో అక్కడి ఉన్నతాధికారులు జిల్లా అధికారితోపాటు ఉద్యోగులను మందలించినట్లు తెలిసింది. జిల్లాలో 350కిపైగా మత్స్య సహకార సంఘాలున్నాయి. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు మత్స్యశాఖ పని చేస్తోంది. కానీ, పథకాలు అందాలన్నా.. ఇతర పనులు జరగాలన్నా..చివరికి కొత్త సంఘాలు ఏర్పాటు కావాలన్నా.. ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ ‘ఎన్‌ఎఫ్‌డీబీ’ పథకం కింద పలు మత్స్యకార సంఘాలు ఇటీవల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రుణాలు పొందాలంటే మత్స్య సొసైటీలకు బైలా కచ్చితంగా ఉండాలి. బైలా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు కేవలం రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. కానీ, నిబంధనలు సాకుగా చూపెట్టి ఒక్కో సొసైటీ నుంచి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు తీసుకున్నట్లు మత్స్యకారులు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 50 సంఘాలకు బైలా చేసిచ్చారు. వసూలైన డబ్బులను డిపార్ట్‌మెంట్‌లో వాటాలుగా పంచుకున్నట్లు తెలిసింది. అలాగే ఇటీవల కొత్తగా మత్స్యకార సంఘాలను ఏర్పాటు చేయగా వారి నుంచి డబ్బులు రూ.వేలల్లో దండుకున్నట్లు సమాచారం. ఇందులో మహిళా సొసైటీలు సైతం బాధితులుగా ఉన్నారు. మరోవైపు చెరువులకు తహసీల్ కట్టించుకునే విషయంలో సైతం అడ్డగోలుగా డబ్బులు తీసుకున్నట్లుగా కొందరు మత్స్యకారులు చెప్తున్నారు. మత్స్య శాఖలో జరుగుతున్న వసూళ్ల బాగోతంపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా అధికారిపై మండిపడినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ఫిషరీష్ చైర్మన్‌తోపాటు మొన్నటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన రాజీవ్‌గాంధీ హనుమంతు కూడా ఈ విషయమై ఆరా తీశారు. తమకు జిల్లా అధికారి వద్దని, అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాల నాయకులు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులను కోరారు. దీంతో సదరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
ఉద్యోగులపైనే
ఆరోపణలు వచ్చాయి
శాఖలోని కొందరు ఉద్యోగులు మత్స్య సహకార సంఘాల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిని నెల క్రితమే మందలించాను. ఇందులో నాకు కూడా భాగముందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. బైలా చేయాలంటే సొసైటీలు రూ.500 ఇస్తే సరిపోతుంది.
– ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి
● డొంకేశ్వర్ మండలంలో ఓ గ్రామానికి చెందిన మత్స్య సహకార సంఘానికి బైలా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. వాస్తవానికి బైలా చేయడానికి రూ.500 చలానా కడితే సరిపోతుంది. బైలా కాపీలను బైండింగ్ చేసినందుకు మరో రూ.500 కలిపి మొత్తం రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. కానీ, మత్స్యశాఖ అధికారులు సదరు సంఘం వద్ద రూ.10 వేల వరకు వసూలు చేశారు. ఇదే విధానంలో చాలా మత్స్య సంఘాల వద్ద వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.