
యువకుడి దారుణ హత్య
● ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ విఠల్‌రెడ్డి
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుందలోని ఊరడమ్మ గల్లీకి చెందిన అడికె రమేశ్(35)కు పదేళ్ల క్రితం మహాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మహాదేవి పుట్టింటికి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి రమేశ్ మారేడు గుడి వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవిస్తున్నాడు. కాగా, పెద్ద దేవాడకు చెందిన సమీప బంధువు కాశీనాథ్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చి రమేశ్ ఇంటి తలుపు కొట్టాడు. రమేశ్ తలుపు తీయడంతో వెంటనే కాశీనాథ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో రమేశ్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐ రవికుమార్, ఎస్సై మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాశీనాథ్ భార్యతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతోనే తన కొడుకును హత్య చేసినట్లు రమేశ్ తల్లి గంగామణి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.