
మేకల కొట్టంపై చిరుత పులి దాడి
బోధన్: ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో మేకల కొట్టంపై బుధవారం రాత్రి చిరుత పులి దాడి చేసి ఒక మేకను తీసుకెళ్లింది. వివరాలు ఇలా.. జానకంపేట గ్రామానికి చెందిన వెల్మలా సందీప్‌కు గ్రామ శివారులోని నవీపేట–బాసర రైల్వేగేట్ అవతల మేకల కొట్టం ఉంది. ఈ కొట్టంలో అతడు మేకలతోపాటు కొన్ని గేదెలను సంరక్షిస్తున్నాడు. కొట్టంపై బుధవారం రాత్రి చిరుత పులి దాడి చేసి ఒక మేకను తీసుకెళ్లింది. వెంటనే ఈ విషయాన్ని అతడు అటవీశాఖ అధికారులకు తెలిపాడు. గురువారం అటవీశాఖ నవీపేట సెక్షన్ బీట్ ఆఫీసర్ సుధీర్ ఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. చిరుత పులిదాడి ఘటన వాస్తవమేనని ధ్రువీకరించారు. ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో మూడు నెలల క్రితం చిరుత పులి సంచరించింది. నవీపేట మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో చిరుత పులుల సంచారం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి సంజయ్‌గౌడ్ తెలిపారు. చిరుత సంచారంతో జానకంపేటతోపాటు పోచారం, దూపల్లి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.