
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి
నిజామాబాద్ రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలని, పనిలో పారదర్శకత ఎంతో అవసరమని జెడ్పీ సీఈవో సాయాగౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్ భవనంలో కారుణ్య నియామకం పొందిన జూనియర్ అసిస్టెంట్లకు సర్వీసు నిబంధనలకు పది రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో సాయా గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ చట్టం, లోకల్ బాడీపై అవగాహన ఉండాలని అన్నారు. పది రోజులపాటు అకౌంట్స్, జిల్లా పరిషత్ ఎన్నికలు, పే బిల్స్, కార్యాలయ నిర్వహణ, ఆర్‌టీఐ తదితర వాటిపై అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం భాస్కర్, జనరర్ సెక్రెటరీ ప్రదీప్, అసోసియేట్ ప్రెసిడెంట్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ సునీతాదేవి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిద్ధు పటేల్ తదితరులు పాల్గొన్నారు.