
అడ్మిషన్లు ఒకచోట.. చదువులు మరోచోట..
● పాత వర్నిలోని జ్యోతిబా పూలే విద్యాలయం నిర్వాకం
● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
వర్ని: మండలంలోని పాత వర్నిలో జ్యోతిబా పూలే బాలికల పాఠశాల/కళాశాల ఉంది. ఇక్కడ పాఠశాల స్థాయి విద్యా బోధన కొనసాగుతుండగా, ఇంటర్, డిగ్రీ కళాశాల పేరుకే ఇక్కడ ఉంది. ఇంటర్, డిగ్రీలో అడ్మిషన్లు మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారు. బోధన మాత్రం ఇంటర్ విద్యార్థులకు కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలో, డిగ్రీ విద్యార్థులకు జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లిలో చేస్తున్నారు. దీంతో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గదుల కొరతే కారణం..
ఈ విద్యాలయంలో ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యా బోధన అందించాల్సి ఉండగా భవనాల కొరతతో గత మూడు సంవత్సరాలుగా ఇంటర్ పిట్లంలో, డిగ్రీ మునిపల్లిలో కొనసాగిస్తున్నారు. వర్నిలో కేవలం ఐదు తరగతులకు సరిపడా గదులు ఉండటంతో ఇంటర్, డిగ్రీ బోధన ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులుండగా మొదటి సంవత్సరంలో 38, ద్వితీయ సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. డిగ్రీలో 8 సబ్జెక్టులకు గాను 320 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యాలయంలో కళాశాలలను నిర్వహించాలంటే సుమారు 30 గదులు ఉంటేనే బోధనకు సాధ్యమవుతుంది. ప్రస్తుతం 10 గదుల్లో మాత్రమే విద్యాబోధన, హాస్టల్‌కొనసాగుతోంది. అరకొర వసతుల మధ్య కళాశాల నిర్వహణ కొనసాగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి, విద్యాలయానికి తగిన భవనాలు, గదులను నిర్మించాలని విద్యార్థినులు కోరుతున్నారు.
హైస్కూల్ మాత్రమే నిర్వహిస్తున్నాం..
విద్యాలయంలో కళాశాల బోధన కొనసాగించాలంటే మరో 25 గదుల వరకు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 10 గదుల్లో హైస్కూల్ సెక్షన్ మాత్రమే నిర్వహిస్తున్నాం. హాస్టల్ నిర్వహణకు కూడా గదుల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కళాశాల నిర్వహణకు నిధులు మంజూరు చేసి, అదనపు గదులు నిర్మించాలి. –పద్మజ, ప్రిన్సిపాల్,
జ్యోతిబా పూలే విద్యాలయం, వర్ని