
సర్వేయర్లు కీలకపాత్ర పోషించాలి
నిజామాబాద్‌అర్బన్: భూ భారతి చట్టం అమలులో సర్వేయర్లు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం కోసం ఎంపిక చేసిన వారికి 50 రోజులపాటు శిక్షణ కొనసాగనుంది. శిక్ష ణ తరగతులను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సోమవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందని, సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు ఆసక్తిగల వారిని ఎంపిక చేసి సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చి లైసెన్సులు ఇవ్వనుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 300 మంది అర్హులను శిక్షణ కోసం ఎంపిక చేశామన్నారు. సర్వేయర్లు భూ భారతి చట్టంలో పొందుపర్చిన 5, 7, 8 సెక్షన్ ల ప్రకారం భూముల క్రయవిక్రయాలు, సక్సేషన్ వంటి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి మ్యాప్‌లను రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు సర్వే చేపట్టి భూముల హద్దులు, సమగ్ర వివరాలతో సర్వే మ్యా ప్‌లను సమర్పిస్తే, వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన తరువాత పట్టాపాస్ పుస్తకాలకు జతచేయడం జరుగుతుందని తెలిపారు. పట్టా పాస్‌పుస్తకాలు ఉన్న రైతులు సర్వే మ్యాప్ కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్వేయర్లతో సర్వే చేయించుకోవచ్చని సూచించారు. భూధార్ నంబర్‌ల కేటాయింపునకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని శిక్షణ పొందు తున్న వారికి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తుందని, ఉత్తీర్ణులైన వారికి లైసెన్సులు, గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, ఇన్‌స్పెక్టర్ కిషన్, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో 300 మందికి
50 రోజులపాటు శిక్షణ
శిక్షణ అనంతరం లైసెన్సుల జారీ
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు