
ఎస్సీ వర్గీకరణ రద్దయ్యే వరకు పోరాటం చేద్దాం
నిజామాబాద్‌నాగారం: ఎస్సీ వర్గీకరణ రద్దయ్యే వరకు న్యాయ పోరాటం చేద్దామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ కాలనీలోగల ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం మాలమహానాడు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నయ్య హాజరై మాట్లాడారు. మనమందరం ఐక్యంగా ఉండి కోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ రద్దు అయ్యేవరకు న్యాయ పోరాటం చేయాలన్నారు. అందుకు ప్రతి మాల సోదరుడి నైతిక సహాయం అవసరం ఉందని తెలిపారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండల బోరేగంలో బుద్ధ పూర్ణమి రోజున బుద్ధ భగవాన్ విగ్రహం పెట్టినందుకు దళితులపై అగ్రకులాల వారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడ్డవారిపై పోలీస్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, ఎల్లయ్య, జిల్లా నూతన అధ్యక్షుడు చొక్కం దేవిదాస్, టీమ్ కన్వీనర్ అలుక కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, కోశాధికారి రాజన్న, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.