
సీడ్ మక్కవైపే మొగ్గు
బాల్కొండ: పసుపు పంటలో అంతర్‌పంటగా సాగు చేసే మక్క పంటలో రైతులు సీడ్ మక్కల వైపే మొగ్గు చూపుతున్నారు. పసుపు పంటలో అంతర్ పంటగా రైతులు మక్క పంటను సాగు చేస్తారు. సీడ్ మక్క పంట ఎక్కువ ఎత్తుగా పెరగదు. అంతే కాకుండ పసుపు పంటకు గాలి, సూర్యరశ్మీ అందడంతో ఎలాంటి అడ్డంకి ఉండదు. దీంతో రైతులు సీడ్ మక్కల వైపే మొగ్గు చూపుతున్నారు. రైతులు సాగు చేసే సీడ్ పంటనే మళ్లీ తరువాత పంటకు వ్యాపారులు విత్తనాలుగా మార్చి అందిస్తారు. దీంతో రైతులు సీడ్ మక్కల వైపే మొగ్గు చూపుతున్నారు.
సీడ్ కంపెనీ వ్యాపారుల ఒప్పందాలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే సీడ్ వ్యాపారులు పల్లెల్లో రైతులతో మక్క పంట ఒప్పందాలను చేసుకుంటున్నారు. తాజాగా గురువారం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో మక్క పంటకు చెందిన ఓ సీడ్ కంపెనీ వ్యాపారి రైతులతో ఒప్పందం చేసుకున్నాడు. క్వింటాల్‌కు రూ. 2 వేలు చెల్లించుటకు ఒప్పందం కుదిరింది. విత్తనాలను వారే సరఫరా చేసి పంట దిగుబడిని కూడ వారే కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ రకం మక్క విత్తనాలను కేవలం పసుపు పంటలో మాత్రమే అంతర్ పంటగా సాగు చేయాలని పేర్కొన్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, రాకపోయినా వ్యాపారి రైతులకు చెల్లించాలి. అదనంగా వస్తే అదనంగా చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. మక్క పంట దిగుబడి వచ్చిన తరువాత మక్క పంట కంకుల బూరు తొలిగించి ఇవ్వాలని అన్నారు. కంపెనీ నిబంధనాల ప్రకారం పంట సాగు చేపట్టాలి. పంట దిగుబడి వ్యాపారికి అందించిన 10 రోజుల తరువాత రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈక్రమంలో రైతులు సీడ్ మక్క సాగువైపే ఆసక్తి చూపుతున్నారు.
పసుపు పంటలో అంతర్‌పంటగా సాగుచేస్తున్న రైతులు
క్వింటాల్‌కు రూ.2000 చెల్లించేలా రైతులతో వ్యాపారుల ఒప్పందం
సీడ్ మక్కలే సాగు చేస్తా..
పసుపు పంటలో సీడ్ మక్కలనే సాగు చేస్తాను. సీడ్ మక్కల కర్ర ఎక్కువగా పెరగదు. దీంతో పసుపు పంటకు ఇబ్బంది ఉండదు. ధర కూడ బాగానే చెల్లిస్తున్నారు. ఎకరానికి రూ. 30 వేల ఆదాయం వస్తుంది. – తలారి గాబ్రియెల్, రైతు