
కనిపించని కచ్చితత్వం
● తూనికలు, కొలతలపై అవగాహన
నామమాత్రమే
● ఆ శాఖ మనుగడలో ఉందా? లేదా?
అని సందేహాలు
● కనీసం ఉనికి చాటని వైనం
● బంగారం బిల్లులపై కనిపించని
హెచ్‌యూఐడీ నంబర్
● నేడు అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం
వ్యాపారి నుంచి వస్తువు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుడికి ఆ వస్తువుకు సంబంధించిన కొలతల కచ్చితత్వం, దాని నాణ్యతలో విశ్వసనీయత ఎక్కడా కనిపించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తూనికలు, కొలతల 2011 లీగల్ మెట్రాలజీ నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. అసలు తూనికలు, కొలతల శాఖ మనుగడలో ఉందా? అనే పరిస్థితి ఉంది. నేడు అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
సాక్షి ప్రతినిధి,
నిజామాబాద్: తూనికలు, కొలతల శాఖ విధులకు సంబంధించి ప్రభుత్వాలు అవగాహన కల్పించే విషయంలో ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. వ్యాపారులు యథేచ్ఛగా మోసం చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తూనికలు, కొలతల శాఖ 2011 లీగల్ మెట్రాలజీ రూల్స్ అమలు చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యం నెలకొంది. అసలు ఈ శాఖ పనిచేస్తున్న సంగతే ఎవరికీ తెలియని పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకే లీగల్ మెట్రాలజీ శాఖ గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇక ఉమ్మడి జిల్లా లో గ్రామీణ వినియోగదారుల శాతం అత్యధికంగా 67శాతం ఉంది.
తూనికలు, కొలతలకే
పరిమితం కాదు..
లీగల్ మెట్రాలజీ శాఖ కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లలో తూనికలు కొలతలలకే పరిమితం కాదనే విషయాన్ని వినియోగదారులు తెలుసుకోవాలి. ఇదిలా ఉండగా సంబంధిత అధికారులు సైతం పెట్రోల్, డీజిల్ విషయంలోనూ క్వాంటిటీపై ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు చూసే థర్మామీటర్, గ్యాస్ మీటర్లు, ఇంటర్‌నెట్ స్పీడ్ లెక్కించడం, ఆటో మీటర్లు, ట్యాక్సీ మీటర్లు, తూకం రాళ్లు, ఎల క్ట్రానిక్ కాంటాలు, వే బ్రిడ్జీలు, హోటళ్లలో ఇష్టం వచ్చిన ధరలకు నీళ్ల బాటిళ్లు తదితర వాటిని లీగల్ మెట్రాలజీ అధికారులు పర్యవేక్షించాలి. కానీ ఆ దిశగా అధికారులు పని చేయకపోవడంతో ఎవరూ నిబంధనలు పాటించడంలేదు. ‘లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్ 2011‘ మేరకు గ్యాస్ మీటర్లు, ఇంటర్నెట్ స్పీడ్‌ను తెలుసుకొనే పరికరాలు, ఆహార పదార్థాలలో కొవ్వు శాతం తెలుసుకొనే పరికరాలు, శ్వాస వేగం తెలుసుకొనే బ్రీత్ అనలైజర్స్, టాక్సీ మీటర్లు, రైల్వే వే బ్రిడ్జీలు, నీటిలో చల్లదనం, వేడి శాతం తెలుసు కొనే వాటర్ మీటర్లు తదితర కొలతల్లో వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి గాను లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011లో సవరణలు జరిగాయి.
రెడీమిక్స్‌కూ లీగల్ మెట్రాలజీ నిబంధనలు..
భవన నిర్మాణాలకు సంబంధించి బిల్డర్లు అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో లీగల్ మెట్రాలజీ నిబంధనలు పాటించాల్సి ఉంది. సిమెంట్, ఇసుక, కంకర మిక్స్ విషయంలో పాటించాల్సిన ప్రమాణాల విషయంలో తూనికలు, కొలతల విభాగం అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయాలపై వినియోగదారులకు సైతం ఏమాత్రం అవగాహన లేదు.
సినిమా థియేటర్లలో..
నిజామాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్‌లు, థియేటర్‌లలో ఇష్టారీతిన ధరలు వసూలు చేస్తున్నారు. తినే పదార్థాల ప్యాక్‌లపై ఇష్టం వచ్చినట్లు ఎమ్మార్పీలు ముద్రించి విక్రయిస్తున్నారు. నీళ్ల బాటిళ్లు, శీతల పానీయాలు, తినుబండారాల విషయంలో భారీ దోపిడీ సాగుతోంది. బయటితో పోలిస్తే అనేక రెట్ల ధరలు వసూలు చేస్తున్నారు. ఇక తినుబండారాల నాణ్యత మరీ తీసికట్టే.
కమిషన్‌ను ఆశ్రయించాలి
బంగారం విషయంలో హెచ్‌యూఐడీ నంబర్లు ఇవ్వకపోయినా, నిబంధనలు పాటించకపోయినా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్‌కు ఫి ర్యాదు చేయాలి. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులను సంప్రదించాలి. అయినప్పటికీ పట్టించుకోకపోతే వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించాలి. పెట్రోల్, డీజిల్ క్వాలి టీ, క్వాంటిటీ విషయంలో తేడాలుంటే పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారులు పట్టించుకోకపోతే వినియోగదారుల కమిషన్‌కు వెళ్లాలి. అందరూ తూనికలు, కొలతలపై అవగాహన కలిగి ఉండాలి. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల
మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి

కనిపించని కచ్చితత్వం

కనిపించని కచ్చితత్వం