
వేగవంతంగా ధాన్యం సేకరించాలి
జక్రాన్‌పల్లి/ పెర్కిట్/ మోర్తాడ్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని నిర్వాహకులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి, ఆర్మూర్ మండలం మంథని, మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం రైతులను పలకరిస్తూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా? తూకంలో ఏమైనా తేడాలు ఉంటున్నాయా? అని ఆరా తీశా రు. గ్రెయిన్ క్యాలిపర్ ద్వారా నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా సన్న ధాన్యం ఉందా లేదా అని కలెక్టరే స్వయంగా పరిశీలించారు. బాగా ఆరబెట్టి, శు భ్రపర్చిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని, సన్నధాన్యానికి అదనంగా క్వింటాలుకు రూ.500 ల చొప్పున బోనస్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. తేమ 17 శాతానికి మించకుండా ఎఫ్‌ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తద్వారా పూర్తిస్థాయి లో రైతులకు మద్దతు ధర అందడమే కాకుండా, రైస్‌మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులుండవని హితవు పలికారు. కొనుగోలు కేంద్రాల వద్ద మాయిశ్చర్ యంత్రాలు, టార్పాలిన్లు, వెయింగ్ మెషిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అకాల వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నందున వేగవంతంగా ధాన్యం సేకరిస్తూ, నిర్దేశిత రైస్ మిల్లుల కు తరలించాలన్నారు. రైస్‌మిల్లుల నుంచి ఎప్పటికప్పుడు ట్రక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొన్న వెంటనే రైతులకు పూర్తి వివరాలతో కూడిన రసీదును తప్పనిసరిగా అందజేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజాగౌడ్, డీసీవో ఎన్ శ్రీనివాస్‌రావు, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్లు సత్యనారాయణ, కృష్ణ, ఎంపీడీవోలు తదితరులు ఉన్నారు.
ఎఫ్‌ఏక్యూపై రైతులకు
అవగాహన కల్పించాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
జక్రాన్‌పల్లి, ఆర్మూర్, మోర్తాడ్‌లో
కొనుగోలు కేంద్రాల పరిశీలన