
బాలుడి అదృశ్యం.. అరగంటలో గుర్తించిన పోలీసులు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి బస్టాండ్‌లో నాలుగేళ్ల బాలుడు తప్పిపోగా పోలీసులు అరగంటలో గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన వల్లపు నర్సవ్వ తన నాలుగేళ్ల మనువడు ఈశ్వర్‌ను వెంట తీసుకొని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చి తిరుగు ప్రయాణంలో కొత్త బస్టాండ్‌కు చేరుకుంది. జ్యూస్ కొనుక్కుని వస్తానని బస్టాండ్‌లో మనువడిని కూర్చోబెట్టి పక్కనే ఉన్న స్టాల్‌కు వెళ్లింది. 5 నిమిషాల తర్వాత వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన నర్సవ్వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ శిరీష, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి బాలుడి ఆచూకీ కోసం గాలించారు. అరగంట తర్వాత అశోక్‌నగర్ చౌరస్తా వద్ద బాలుడిని గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి బాలుడిని తండ్రి అలకుంట ఎల్లయ్య, అమ్మమ్మ నర్సవ్వకు అప్పగించారు. పోలీసు సిబ్బందిని పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట వెనుకాల ఓ హోటల్ పక్కన ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మృతుడికి సుమారు 15– 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఒంటిపై ఎరుపు రంగు టీషర్టు, బ్లూకలర్ జీన్స్ ప్యాంటు ఉందని పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు.

బాలుడి అదృశ్యం.. అరగంటలో గుర్తించిన పోలీసులు