● ఖాజాపూర్–హున్సా గ్రామల మధ్య
వాగుపై 25 ఏళ్ల క్రితం నిర్మాణం
● అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో
పగుళ్లు ఏర్పడిన వైనం
బోధన్: సాలూర మండలంలోని ఖాజాపూర్– హున్సా గ్రామాల మధ్య ఉన్న వాగుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన పైభాగంలో పగుళ్లు ఏర్పడటంతోపాటు, సైడ్‌వాల్స్ దెబ్బతినడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు మండలాలకు ప్రధాన వారధి..
ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య గల వాగుపై గతంలో లో–లెవల్ వంతెన ఉండగా 25ఏళ్ల క్రితం హైలెవల్ వంతెనను నిర్మించారు. ఈ వంతెన బోధన్, సాలూర, పోతంగల్, కోటగిరి మండలాలకు మధ్య రాకపోకలకు ప్రధాన వారధిగా ఉంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ముఖ్య పట్టణాలు, గ్రామాల నుంచి సాలూర మండల కేంద్రం నుంచి ఖాజాపూర్ వంతెన మీదుగా ఇతర మండలాలకు వెళ్తుంటారు. పోతంగల్, బీర్కూర్ మండలాల మీదుగా బానువాడ, జుక్కల్ మండలంలోని బిచ్కుంద, మద్నూర్, మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా కేంద్రాలకు ఈ వంతెన పైనుంచి ప్రజలు వ్యక్తిగత పనులు, శుభకార్యాలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోపాటు నిత్యం ఆర్టీసీ బస్సులు, ప్యాసింజర్ ఆటోలు, ద్విచక్రవాహనాలు రవాణా వేలసంఖ్యలో ఉంటుంది. మంజీర నది తీరంలో ఉన్న హున్సా, మందర్న, ఖాజాపూర్ గ్రామాల శివారులోని ఇసుక క్వారీల నుంచి టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్ల రవాణా జోరుగానే సాగుతుంది. దీంతో అధిక బరువుల వాహనాల రవాణాతో వంతెన దెబ్బతింటోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి వంతెనకు వెంటనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకోవాలి..
మా గ్రామం పక్కనే ఉన్న వంతెన కూలిపోయే దశకు వచ్చింది. ఆలస్యం చేయకుండా అధికారులు తాత్కాలికంగానైనా మరమ్మతులు చేపట్టాలి. ఈ వంతెన మీదుగా వాగు అవతలి ఒడ్డున ఉన్న రైతులమంతా పొలాలకు నిత్యం వెళ్తుంటాం. మా గ్రామస్తులకే కాక అనేక గ్రామాల ప్రజల రాకపోకలకు వంతెన ఎంతో సౌకర్యం ఉంది. అధికారులు ఇప్పటికై నా స్పందించాలి.
– చిద్రపు రమేష్, ఖాజాపూర్, సాలూర మండలం
శిథిలావస్థలో వంతెన
శిథిలావస్థలో వంతెన