బియ్యం నిలువలు
● ఏప్రిల్ 1 నుంచి రేషన్‌కార్డు దారులకు
సన్నబియ్యం పంపిణీ
● మిగిలి ఉన్న దొడ్డుబియ్యంపై విజిలెన్స్ ఆరా
● గతంలో డీలర్లకు ఇచ్చిన కోటాలో
కొంత మిగిలి ఉన్నట్లు రికార్డుల్లో నమోదు
మోర్తాడ్(బాల్కొండ): రేషన్ డీలర్ల వద్ద మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిలువల్లో ఏమైనా తేడా ఉందా? లెక్కలు పక్కాగానే ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్న దృష్ట్యా డీలర్ల వద్ద మిగిలిపోయినట్లు రికార్డుల్లో నమోదైన దొడ్డు రకం బియ్యం వాస్తవ నిల్వలను తెలుసుకునేందుకు తనిఖీలను విస్తృతం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ గోదాముల నుంచి ప్రతి నెలా రేషన్ డీలర్లకు దొడ్డు రకం బియ్యాన్ని చేరవేసేవారు. కొన్ని చోట్ల సకాలంలో వినియోగదారులు బియ్యం తీసుకోకపోవడంతో ఆ బియ్యం మిగిలిపోయింది. కొందరు డీలర్లు మాత్రం నిలువలు ఏమీ లేనట్లు చూపగా మరి కొందరు మాత్రం తమ వద్ద నిలువలు ఉన్నాయని రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా జిల్లాలోని వివిధ రేషన్ డీలర్ల వద్ద ఈ రోజు వరకూ 6,680 క్వింటాళ్ల 91 కిలోల బియ్యం నిలువ ఉన్నట్లు తేలింది. ఈనెల 20వ తేదీన బియ్యం పంపిణీ ముగిసిపోయిన తరువాత ఈ–పాస్ యంత్రంలో నమోదైన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు తనిఖీలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. అనేక చోట్ల బియ్యం నిలువ ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా వాస్తవానికి బియ్యం నిలువలు లేవని తమకు సమాచారం ఉందని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డీలర్లకు సమాచారం ఇచ్చిన అధికారులు.. నిల్వ ఉన్న బియ్యాన్ని తాము తనిఖీలకు వచ్చిన సమయంలో పక్కాగా చూపాలని సూచించారు.
దొడ్డు రకం బియ్యం పంపిణీ చేస్తే చర్యలు
లబ్ధిదారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం పంపిణీ చేయొద్దని డీలర్లకు అధికారులు సూచించారు. మిగులు బియ్యాన్ని ఏమి చేయాలి అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత వెల్లడిస్తా మని అధికారులు చెబుతున్నారు. రికార్డుల్లో చూపిన విధంగా బియ్యం నిలువలు లేని పక్షంలో డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మిగులు బియ్యం ఉండాల్సిందే
రేషన్ డీలర్లు ఎవరైతే తమ వద్ద దొడ్డు బియ్యం మిగిలి ఉందని లెక్కలు చూపారో ఆ బియ్యం షాపుల్లో ఉండాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. మిగులు దొడ్డు బియ్యాన్ని ఏమి చేయాలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తరువాత వెల్లడిస్తాం. – అరవింద్‌రెడ్డి,
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి