డొంకేశ్వర్(ఆర్మూర్): అన్ని వనరుల్లోకెల్లా అతి ముఖ్యమైనది జలం. మానవులతో పాటు జీవరాశులకు ఇదే ప్రధాన జీవనాధారం. అలాంటి నీటిని కాపాడుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేయకపోయినా కనీసం నీటిని పొదుపుగా కూడా వాడుకోవడం లేదు. తద్వారా ప్రతీ ఏడాది వేసవిలో కొన్ని ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి ఎదురవుతోంది. పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. నేడు ‘ప్రపంచ నీటి దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై సాక్షి ప్రత్యేక కథనం.
కుళాయిల ద్వారా వృథాగా..
జల వనరులను ఏవిధంగా కాపాడుకోవాలనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులతో ప్రజలను చైతన్యం చేయించడం లేదు. దీంతో నీటి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. నీటి వృథా కూడా అదే స్థాయిలో జరుగుతోంది. పల్లెల్లో వ్యవసాయ బోర్ల కనెక్షన్లు, గృహ వినియోగ బోర్ల కనెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలో సమారు వ్యవసాయ బోరు బావులు సుమారుగా 1.81లక్షలు ఉండగా, గృహ బోరు కనెక్షన్లు 6.70లక్షలు ఉన్నట్లు అంచనా. అలాగే జిల్లాలో ప్రస్తుత సరాసరి నీటిమట్టం 10 మీటర్ల లోతు ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామాల్లో నీటి సరఫరా, వాడకంపై పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు పర్యవేక్షణ చేయడం లేదు. వీధుల్లో, కుళాయిలకు ఆన్–ఆఫ్ సిస్టం లేకపోవడంతో గంటల తరబడి నీరు వృథాగా పోతుంది. తద్వారా భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. నిరంతరం బోర్లు నడవడంతో విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయి.
ఇంకిపోతున్న భూగర్భ జలాలు..
జల వనరులను కాపాడుకునే
ప్రయత్నం చేయని ప్రజలు
చైతన్యం చేయని
ప్రభుత్వం, అధికారులు
నేడు ప్రపంచ నీటి దినోత్సవం
ఇంకుడు గుంతలే మార్గం..
జిల్లాలో బోరుబావుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. తద్వారా నీటి వాడకం ఎక్కువైంది. వ్యవసాయ బోర్ల ద్వారా ఎక్కువగా నీటి వినియోగం జరుగుతుంది. నీటిని ఎంతంత వాడుతున్నారో అంతకు మించి సంరక్షించాలి. వ్యవసాయ భూముల్లో ఫారంపాండ్‌లు, ఇంటికో ఇంకుడుగుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలి.
– శ్రీనివాస్ బాబు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి
ప్రస్తుతం జిల్లాలో ఐదారు మండలాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. భీమ్‌గల్, సిరికొండ, డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, నవీపేట్ మండలాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఐతే, వేసవిలో సైతం భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండాలంటే వ్యవసాయ క్షేత్రాల్లో ఫాంపాండ్‌లు నిర్మించుకోవాలి. అలాగే ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను కట్టుకోవాలి. తద్వారా నీటి వృథా తగ్గి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టి, ప్రజలు, రైతులను కూడా చైతన్యం చేయించాలి. అలాగే నీటిని వృథా చేయకుండా, తక్కువగా వాడే పరికరాలను వాడాలి. వాడిన నీటిని మళ్లీ ఉపయోగించే పద్ధతులను అవలంబించాలి.
కానరాని నీటి పొదుపు