ఎస్సెస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం
● ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం
● మాస్‌కాపీయింగ్‌కు తావుండదు..
● ఒకవేళ జరిగితే పరీక్షల అధికారులను
బాధ్యులను చేస్తాం
● సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
● హాల్‌టికెట్లపై తప్పులుంటే ఆందోళన చెందొద్దు
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో
జిల్లా విద్యాశాఖాధికారి అశోక్
నిజామాబాద్ అర్బన్: పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఈసారి ఆన్సర్ షీట్లకు బదులు 24 పేజీల బుక్‌లెట్‌ను అందజేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ తెలిపారు. ఒక్కో సబ్జెక్ట్‌కు 24 పేజీల ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో ఉండే బుక్‌లెట్ అందిస్తామని, అలాగే ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్‌కు 12 చొప్పున పేజీలుండే బుక్‌లెట్‌లను ఇస్తామన్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహిస్తామని, హాల్ టికెట్లపై తప్పులుంటే విద్యార్థులు ఆందోళన చెందొద్దని సూచించిన డీఈవోతో పరీక్షల నిర్వహణపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
● పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారా?
● 141 సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఇన్విజిలేట ర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించాం. విద్యార్థులు గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి.
● మాస్‌కాపీయింగ్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలు..?
● ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటికే పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. మాస్‌కాపీయింగ్‌కు అవకాశం ఉండే సెంటర్లలో ముందస్తు చర్యలు చేపట్టాం.
● కొత్త నిబంధనలు ఏమైనా ఉన్నాయా..?
● ఈ ఏడాది కేవలం ఆరు పేపర్లతో పరీక్షలు ఉంటాయి. కొత్తగా నిబంధనలు ఏమీ లేవు. కేవలం పేపర్ల సంఖ్య మాత్రమే తగ్గింది. విద్యార్థులు సజావుగా పరీక్షలు రాయొచ్చు.
● గ్రామీణ ప్రాంతాల్లోని సెంటర్లలో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం ఉందనే ఆరోపణలపై..
● పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా జిల్లాలోని 141 సెంటర్లలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. ఏ సెంటర్‌లో మాస్‌కాపీయింగ్ జరిగినా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్‌ఆఫీసర్లను బాధ్యులను చేస్తాం. మాస్‌కాపీయింగ్ నిరోధానికి ప్రత్యేక బృందాలున్నాయి ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారు. సీసీ కెమె రాలతో నిఘా కొనసాగుతోంది.
● సెంటర్లలో ఏర్పాట్లు..?
● ఎగ్జామినేషన్ సెంటర్లలో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు, టేబుళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ వైద్య బృందాలు విధుల్లో ఉంటాయి. సెంటర్లలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపడతారు.
మొత్తం విద్యార్ధులు : 22,915
బాలికలు : 11,239
బాలురు : 11,418
ప్రైవేట్/సప్లిమెంటరీ : 258
విద్యార్థులు
ఎగ్జామినేషన్ సెంటర్లు : 141
చీఫ్ సూపరింటెండెంట్, : 141
డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు
ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు : 06
సిట్టింగ్‌స్క్వాడ్‌లు : 141
కంట్రోల్ రూం నంబర్ : 9030282993
పరీక్ష సమయం:
ఉదయం 9.30 నుంచి
మధ్యాహ్నం12.30 గంటల వరకు
హాల్ టికెట్లపై తప్పులుంటే..?
హాల్ టికెట్లపై తప్పులున్నా విద్యార్థులు ఆందోళన చెందొద్దు. పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం. సెంటర్‌లో ఉండే చీఫ్ సూపరింటెండెట్లు, డిపార్ట్‌మెంట్‌ల్ ఆఫీసర్లు పరిశీలిస్తారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలకు సమాచారం ఇచ్చి వివరాలు తెలుసుకొని విద్యార్థులను అనుమతిస్తారు. ఇప్పటికే చాలా మంది తమ హాల్‌టికెట్లను సరిచూసుకున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు ఎక్కువ సెంటర్లు ఇచ్చారనే విమర్శలపై..
అలాంటిదేమీ లేదు మౌలిక సదుపాయాలు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉన్న, సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్న స్కూళ్లను సెంటర్ల కోసం ఎంపిక చేశాం. ఒక ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతంలోని విద్యార్థులందరికీ సౌకర్యంగా ఉండే పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేశాం. అయినా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. సెంటర్ ఏదైనా పూర్తి స్థాయి నిఘా జిల్లా విద్యాశాఖదే ఉంటుంది. ప్రైవేట్ వారికి ఎలాంటి అధికారం కూడా ఉండదు.
క్యూఆర్ కోడ్‌తో ఆన్సర్ బుక్‌లెట్‌లు