
సిద్ధాపూర్‌లో మాట్లాడుతున్న పోచారం
వర్ని: ఎన్నికల సమయంలో తనకు ద్రోహం చేసి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని సిద్ధాపూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. హనుమాజీపేట్, సిద్ధాపూర్ సర్పంచులు తమ స్వప్రయోజనాల కోసం పార్టీ మారారని వారికి ఓటర్లు గుణపాఠం చెప్పాలన్నారు. రూ. కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినా విశ్వాసం చూపకుండా పార్టీ మారారని ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. పార్టీ మారిన సర్పంచులు, నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం పాటుపడని కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూరు, జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్లను మంజూరు చేయించి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి భూములతో పాటు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. సభలో జెడ్పీటీసీ హరిదాసు, సిద్ధాపూర్ మాజీ సర్పంచ్ భారతీనాయక్, నాయకులు వీర్రాజు, కిషన్, గోపాల్, గిరి, బాల్ సింగ్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ బాన్సువాడ అభ్యర్థి
పోచారం శ్రీనివాస్‌రెడ్డి