జిల్లాకు కొత్తగా 74 పాఠశాలలు మంజూరు ఆటాపాటలతో విద్యాబోధన.. కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక వసతులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
ముధోల్ : చిన్నారుల విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జి ల్లాలో కొత్తగా 74 ప్రీప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి జిల్లాలోని ఎంపికై న పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య అధికారికంగా అందుబాటులోకి రానుంది.
ప్రతీ బడికి రూ.1.70 లక్షలు..
ప్రైమరీ విద్యను ఆకర్షణీయంగా, ఆధునికంగా మార్చడానికి ప్రతీ పాఠశాలకు ఫర్నిచర్, ఇండోర్–అవుట్‌డోర్ ఆట వస్తువులు, రంగుల పెయింటింగ్స్‌తో సహా అన్ని మౌలిక సదుపాయాలకు రూ.1.70 లక్షలు కేటాయించనున్నారు.
ఇన్‌స్ట్రక్టర్, ఆయా నియామకాలు..
ప్రతీ ప్రీప్రైమరీ సెక్షన్‌లో ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయాను ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8 వేలు, ఆయాకు నెలకు రూ.6 వేల వేతనం చెల్లించనున్నారు. నియామకాల కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి, త్రీమెంబర్ కమిటీ ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
74 పాఠశాలలు ఎంపిక
జిల్లాలోని 19 మండలాల నుంచి మొత్తం 74 ప్రాథమిక పాఠశాలలను ప్రీప్రైమరీ సెక్షన్ల కోసం ఎంపిక చేశారు. బాసర, భైంసా, దస్తూరాబాద్, దిలావర్‌పూర్, కడెం, ఖానాపూర్, కుభీర్, కుంటాల, లక్ష్మణచందా, లోకేశ్వరం, మామడ, ముధోల్, నర్సాపూర్, నిర్మల్, నిర్మల్ రూరల్, పెంబి, సారంగాపూర్, సోన్, తానూర్ మండలాల్లోని వివిధ గ్రామాల పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త ప్రీప్రైమరీ సెక్షన్ల ప్రారంభంతో జిల్లాలోని చిన్నారులు నాణ్యమైన, ఆధునిక విద్యా వ్యవస్థను అందుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.


