తప్పుడు కేసులు పెడితే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులు పెడితే ఊరుకోం

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గొద్దు ● మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎండీ.జాబీర్‌ అహ్మద్‌

భైంసాటౌన్‌: అధికార పక్షం ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండీ.జాబీర్‌ అహ్మద్‌ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా జరిగిన ఘటనలో వాస్తవాలు పరిశీలించి కేసులు నమోదు చేయాలన్నారు. ఇటీవల 25వ వార్డులో జరిగిన ఘర్షణలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని, లేనిపక్షంలో ఏఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయిస్తామన్నారు. గతంలో వెలుగుచూసిన బెట్టింగ్‌ కేసులో భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు దర్యాప్తు పురోగతి ఏదని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, కానీ, తప్పుడు కేసులు పెడితే ఊరుకోమన్నారు. మున్సిపల్‌లో కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం అనుభవరాహిత్యంతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. తమ హయాంలో హిందూ పండుగలతోపాటు ముస్లిం పండుగలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుత పాలకవర్గం ఇటీవల రంజాన్‌, బక్రీద్‌ పండుగ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేదని విమర్శించారు. కౌన్సిల్‌ సమావేశాల్లో తమ కౌన్సిలర్లు వార్డు సమస్యలను చైర్మన్‌ ద్వారా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తే, 14వ వార్డు కౌన్సిలర్‌ ప్రవీణ్‌ తరచూ జోక్యం చేసుకోవడంతో చర్చ సజావుగా జరగడం లేదన్నారు. పాలకవర్గం పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కనీసం ప్రజలకు సకాలంలో తాగునీరు అందించాలని హితవు పలికారు. సమావేశంలో ఎంఐఎం కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement